పుట:కాశీమజిలీకథలు -09.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

వచ్చు స్త్రీలు మోహనుంజూచి వెఱఁగుపడుచు నిలువంబడి తద్రూపాతిశయము వింతగాఁ జూచుచు నొకళ్లొకళ్ళు చెప్పుకొనుచు గజగుజneడుచు నందే జాగుచేయుచుండిరి.

వారిలో నొక మోహనాంగి సాహసించి వారిదాపునకుఁబోయి నమస్కరింపుచు మహాత్మా! నాకుఁ జేతిరేఖలుజూచి సాముద్రికము జెప్పెదరా? అని చిరునగవుతో నడిగిన సిద్ధవ్రతుండు కాదనలేక చేయిసాచుమని విమర్శించి దానిరహస్యచర్యలు స్థితిగతులు పూసగ్రుచ్చినట్లు నిరూపించి తెలియఁజేసెను.

అప్పు డందున్న యాఁడువాండ్రందఱు సిగ్గువిడిచి క్రమంబున నతని యొద్దకుఁబోయి చేతులు చూపించుకొనుచుండ నయ్యోగియు విసిగికొనక వారివారికిఁ దగినఫలములు నిదర్శనముగాఁ జెప్పుచుండును.

ఆవార్త గ్రామమంతయు వ్యాపించినది. స్త్రీలు గుంపులుగా వచ్చి ఫలముల దెలిసికొనిపోవుచుండిరి. అందలి సుందరులు చాలమంది సాముద్రికము నెపంబున నందువచ్చి మోహనుని సౌందర్యముజూచి మోహసముద్రములో మునిఁగి విభ్రాంతలై బలవంతమున నేగుచుందురు.

ఆ సందడిజూచి మోహనుఁడు యోగితో మహాత్మా! మీ కీబులపాట మేమిటికి? స్త్రీ సంపర్కంబున నింద్రియచాంచల్యము కలుగదా! ద్రవ్యాశ లేనప్పుడు నాకేమియుం దెలియదనక వృథావ్యాసంగముతోఁ బనియేల. వీండ్రరాక నాకు సంకటముగా నున్నదని పలికిన విని నవ్వుచు నతండు రాజపుత్రా! నీ బుద్దినైర్మల్యము దెలియుటకే వీరినిట్లు రప్పించుచుంటిని. వీండ్రందఱు సాముద్రికఫలము నెపముఁజేసికొని నిన్నుఁ జూడవచ్చుచున్నారు. గాలి వీచినప్పుడేకదా దూదికిని ఱాతికిని భేదము దెలియును. దృఢచిత్తుండవు గమ్మని యేమేమియో పలికి వాని హృదయగంధి బిగియఁ జేసెను.

ఆయూర భద్రుఁడను రెడ్డిగలఁడు వాఁడు మిక్కిలి భాగ్యవంతుఁడు. పరమలోభి. కూరకర్ముఁడు. వానికి లేక లేక యొక కుమారుం డుదయించెను. వాఁడు వట్టిపంద. వానికన్న గంగిరెద్దయిన దెలివి గలదని చెప్పవచ్చును. పొలమేగి నాఁగలి దున్నుట తప్ప వానికేమియుం దెలియదు. వానికి గపిలయను భార్య గలదు. దివ్య స్త్రీలకైన నట్టి సోయగము లేదని చెప్పవచ్చును. లెస్సగాఁ జదివినది. సంగీతమున మిక్కిలి పరిశ్రమఁ జేసినది.

ఆ చిన్నది కర్ణాకర్ణిగాఁ జెరువుగట్టున నున్న యోగీంద్రుని ప్రభావము విన్నది. తనకేమైన నతండు మంచియుపాయము జెప్పునేమోయని యాలోచించి పీతాంబరము ధరించి యపహారములఁ గైకొని యొరుల చూడకుండఁ బెరటిదారి నా చెరువుగట్టునకుఁ బోయినది. తొలుత మోహనునిం జూచినది. మోహసముద్రములో మునిఁగిపోయినది దేహము పరవశమైపోయినది. మేను పులకింపఁ గన్నులు మూసికొని యొక్కింతసేపు ధ్యానించింది. తాను వచ్చినపని యేదియో మరచి తబ్బిబ్బు