పుట:కాశీమజిలీకథలు -09.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయదాసుని కథ

115

ప్రత్యేకము పోవుదుముగాక. ఇప్పుడీ పయనము మానుమని పలికిన విని రాజపుత్రుం డిట్లనియె.

మిత్రమా ! మహాయోగు లెప్పుడు నాత్మీయమగు సామర్థ్యమును జెప్పుకొనరు. మనబోటులతో హృదయమిచ్చి మాటాడరు. ఈతం డద్భుతప్రభావసంపన్నుఁడగుట నిక్కువము. మంచియండ దొరకినప్పుడు విడువరాదు. ఈ యోగివరుని చరణసేవ సేయుచు బోయి వీనివలననే నాకామితము బడయుదును కానిచో వీని యాశ్రయబలంబున నాసిద్ధుని యనుగ్రహము సంపాదించెను. ఇప్పుడు నా పయనమున కంతరాయము గలుగఁజేయకుము. కొలఁదికాలములో నభీష్టసిద్ధివడసి యింటికి వచ్చెద. మద్వియోగదుఃఖముఁ బొందకుండ నా తలిదండ్రులఁ గాపాడుమని బోధించినఁ గన్నీరుఁ గార్చుచు డగ్గుత్తికతో సిద్ధార్థుఁ డిట్లనియె.

వయస్యా! నీవు సన్యాసివై సన్యాసివెంట నరుగుచుండఁ జూచి చూచి యింటికడ నెట్టుందును. నీ తలిదండ్రులమాట యట్లుండనిమ్ము. నీ వియోగము నేను సహింపఁగలనా? పదపద. నేనుగూడి మీవెంట వచ్చెదని పలికిన విని రాజపుత్రుండు తమ్ముడా! నామాట వినుము. మనమిద్దర మొక్కసారియే పోయినచో గగ్గోలుపడి మనవారు దేశముల వెదకించి పట్టుకొని తీసికొనిపోవుదురు. నీ విందుండిన నాపోక కొన్నిదినములవఱకు నెవ్వరికిం దెలియదు. నీవు గొన్నిదినంబు లిందుండి మనవారి నెట్లో జోరువెట్టి పిమ్మటఁ గాశీపురంబునకు రమ్ము, అందు నీకొఱకు వేచియుండెద. శ్రీవిశ్వేశ్వరుని యాలయముమీఁద నాయునికి వ్రాసెద. వచ్చి ముందుగాఁ జూచుకొమ్మని పలికి బలవంతమున వాని నొప్పించి నాఁటి వేకువజాముననే యా యోగివెంట మోహనుండు కాశీపురంబునకుఁ బయనంబై పోయెను.

అని యెఱింగించి యవ్వలికథ పైమజిలీయం దిట్లు చెప్పఁ దొడంగెను.

189 వ మజిలీ

కపిల కథ

మోహనుం డట్లు సిద్ధవ్రతుండను యోగీశ్వరునితోఁ గాశీపురంబునకుఁ బోవుచు నొకనాఁడు మల్లెప్రోలను పల్లెఁ జెరువుగట్టున నున్న రావిచెట్టు కిందఁ బస జేయుటయు వారిని భిక్షసేయనీయక తానందలి యంగడికిఁబోయి భోజనసామగ్రి తీసికొనివచ్చి యర్పించెను. ఆ యోగి శిష్యుఁడొకఁడు వంటఁ జేయుటయు నందఱు భుజించిరి.

నాఁడు దూరము నడచి వచ్చుటచే మోహనుని కాళ్ళలోఁ బొక్కు లెక్కినవి. దానంజేసి రెండుదినంబు లందుండక తీరినదికాదు. ఆ తటాకమునకు నీళ్ళకు