పుట:కాశీమజిలీకథలు -09.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

అని పలికిన యా సచివోత్తముఁ డాదివసంబెల్ల వ్యవహారపత్రముల సవరించుకొని కాషాయాంబరములు ధరించి యా రాత్రి వేకువజామున నెవ్వరికిఁ జెప్పకుండ నాయిల్లు విడిచి యా సన్యాసివెంట హరిద్వారమునకుఁ బోవుచుండెను. ఇరువురు నొక మహారణ్యమార్గంబున జాముప్రొద్దెక్కువఱకు నడచిరి. సుకుమార దేహుండగు విజయదాసునకు నెండవేడిమికి మేనెల్ల జెమ్మటలు గ్రమ్మినవి. కాళ్ళు పొక్కులెక్కినవి. అడుగులు తడఁబడ నడుచుచున్న మంత్రిపుంగవు గాంచి యా సన్యాసి యోయీ! పాపము నీవు సంతతము సూర్యకిరణప్రసారమి సొరని గృహాంతరముల వసించువాఁడవు. ఈ పయనమువలన జాల డస్పితివి. ఈ మర్రిచెట్టుక్రింద గొంచెముసేపు విశ్రమింపుము. నే నీ ప్రాంతమందలి గ్రామంబునకుఁబోయి యన్నము యాచించి తెచ్చెద. మన మిద్దరము భుజింతమని పలికిన విని యతండు నీరసముచే మాటాడలేక యట్లే చేయుమని సంజ్ఞచేసి యా వటవిటపి మూలముల హస్తోవధానముగా నేల కొరిగి నిద్రించెను. సన్యాసి కొబ్బరిచిప్పఁ దీసికొని యా దాపుననున్న పల్లెకుం బోయెను.

అంతలో ఢిల్లీచక్రవర్తియొద్దఁ బనికలిగి యొక మహారాజు చతురంగపరివారముతోఁ గూడికొని యమ్మార్గంబునం బోవుచు నాఁటికి ప్రొద్దెక్కినది కావున నమ్మర్రిచెట్టుక్రిందనే బసఁజేయఁదలంచి పరిశీలింపుచు నొడ లెఱుంగక యందు డస్సి పండుకొనియున్న యమాత్యశేఖరుం గాంచి యా రాజు గురుతుపట్టి యోహోహో! ఈతండు నా మిత్రుఁడు ఢిల్లీశ్వరుని మంత్రి విజయప్రతాపరాజవేదండకంఠీరవుఁడు. ఇక్కడ నేమిటికి పడియుండెనో? కాషాయాంబరములుధరించి యున్నాడేమి? ఈతని సహాయము కోరియేకదా నేనుఁ బోవుచుంటిని ? కానిమ్ము. వీని రాకగురించి తరువాత విమర్శింపవచ్చును. ఎండతాకున మృదువగు వీని శరీరము వాడియున్నది. శైత్యోపచారములు సేయుట లెస్సయని తలంచుచు నాతని లేపకయే పైన మృదువగు పట్టు డేరా వేయించి పన్నీరు జల్లుచు వింజామరలని వీపించుచు మీఁదఁ బూవులు జల్లించుచుండెను. అయ్యుపచారములవలన నలయిక తీరి నతనికి మెలకువ వచ్చినది. లేచి చూచి వెఱఁగుపాటుతో మీ రెవ్వరని యడిగెను. ఆ నృపతియు మోడ్పుచేతులతో దేవా! నేను నేపాళదేశ ప్రభుఁడ వీరవర్మయనువాఁడ దేవదర్శనార్ధమై వచ్చుచుంటి దేవర యొంటిగా నిందేమిటికి వచ్చితిరి? కాషాయాంబరధారణమేల ఎద్దియేని వ్రతము గై కొంటిరా? అయ్యయ్యో? ఎండ కన్నెఱుఁగని మీరీచెట్టుక్రింద విజనారణ్యములోఁ బండుకొనియుండ మిక్కిలి యక్కజముగా నున్నది. మీ నిమిత్తము ప్రత్యేకము వంటచేయించితిని. స్నానముఁజేసి భుజింపుడు. తరువాత నంతయుఁ జెప్పుకొనవచ్చు నని పలికిన నతండు శిరఃకంపపూర్వకముగా నంగీకారము సూచించెను.

పదుగురు పరిచారకలువచ్చి వేడినీళ్ళచే జలకమార్చి నూత్నాంబరరాభణాదులచే నలంకరింపజేసిరి. మృష్టాన్నంబులఁచే తృప్తినొందిన పిమ్మట వాని నావట