పుట:కాశీమజిలీకథలు -09.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయదాసుని కథ

111

భోగము లనుభవింపుచుంటివే? ఇంతకన్న యవివేక మేమియున్నది? ఇంతకన్న చెడుకార్య మేమియున్నది? నీవు భాగవతము చదువలేదా.

సీ. రమనీయభూమి భాగములు లేకున్నవే
               పడియుండుటకు దూదిపఱులేలఁ
    గొనకొని వసియింప గుహలు లేకున్నవే
               ప్రాసాద సౌధాది పటలమేల ?
    సహజంబులగు కరాంజలులు లేకున్నవే
               భోజన భాజన పుంజమేల?
    వల్కలాజినకుశావళులు లేకున్నవే
               కట్ట దుకూల సంఘంబులేల?
గీ. ఫలరసాదుల గురియవే పాదపములు
    స్వాదుజలముల నొప్పవే సకలనదులు
    పొసఁగ భిక్షలఁ బెట్టరే పుణ్యసతులు
    ధనమదాంధుల కొలువేల తాపసులకు.

మంత్రి - స్వామీ! క్షమింపుడు. ఇది సుఖప్రారబ్ధముకాదా? అనుభవింపక విడుచునా?

సన్యా - ఆహా! సుఖమును గూడఁ బ్రారబ్ధమని చెప్పుచుంటివే చాలుఁ జాలు. నీ వైదుష్యము తెల్లమైనది.

మంత్రి - స్వామీ! మీరీసుఖము నేమందురు?

సన్యా - ఏమందునా? మదాంధుండవై యవివేకివై మూర్ఖుండవై జడుండవయి దీని ననుభవింపుచుంటి వనుచున్నాను.

మంత్రి - స్వామీ! క్షమింపుఁడు. నేను దీని సుఖప్రారబ్దమని యనుభవింపుచుంటిని. కాని సక్తుండనయి కాదు.

సన్యా - ఓరీ? నీ సుఖప్రారబ్ధమును గడియలో వదలించెద నా చెప్పినట్లు చేయుదువా?

మంత్రి - సుఖముగూడ దుఃఖమువలె ననుభవింపక వదలదు స్వామీ?

సన్యా --- నేను వదలించెద. నా చెప్పినట్లు చేయుదువా?

మంత్రి - సందియమేలా? అట్లే చేయువాఁడ నవహితుండ నాజ్ఞాపింపుఁడు.

సన్యా - ఈ భోగములన్నియు నెట్లు వదలవో చూచెదంగాని హరిద్వారమునకుఁ బోవుదము. ఇప్పుడు బయలుదేరి నాతో రమ్ము.

మంత్రి - చిత్త మట్లే వచ్చెద సాయంకాలమువఱకుఁ దాళుఁడు.