పుట:కాశీమజిలీకథలు -09.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

తొమ్మిదినెలలనుండి మీ దర్శనమునకై యీయూర వేచియున్నాడఁట. ఏ మిచ్చిననుం బుచ్చుకొనఁడు. పని యేదియో చెప్పడు. మీతో నొక్కమాటాడి పోవునఁట. మూఁడునెలలనుండి వీథిగుమ్మము విడువకున్నవాఁడు. ఈ మాట తమతో నివేదించుట కవకాశము దొరికినదికాదని పలికెనో లేదో తలయెత్తి చూచి యేమీ? నిష్కాముఁడైన యొకవిరక్తుడు మూఁడుమాసములనుండి ద్వారమునఁ వేచియుండఁ జెప్పకుంటివా? ఛీ, ఛీ, నిర్భాగ్యుఁడా? వానికన్న మహారాజు లెక్కువవారురా? చారు కానుక లిత్తురని వారి రాఁకఁ దెలియఁజేయుచు నీ బిచ్చగాని మాట చెప్పక వెనుక త్రోయుదువా? ఇట్టి యవివేకినిఁ బ్రతీహారిగాఁ జేయుట మాదియే తప్పు. పోపొమ్ము. ని న్నీపనినుండి తొలగించితినని నిందించుచు మఱియొక దూతం జీరి నీవు సత్వరముఁ బోయి యా బైరాగిం దీసికొనిరమ్మని యాజ్ఞాపించెను.

వాఁడు భయపడుచు వాకిటకుంబోయి సన్యాసిగారూ! రండి మీ మూలమున ద్వారపాలుని నోటిలో మన్ను పడినది. ఆ బుద్ధివిహీనుఁడు మీ మాటయేముందుఁ జెప్పిన దీరిపోవునుగదా! రండు, రండు. అని తొందరపెట్టిన విని యతండు ద్వారపాలకుని కేమి మోసము వచ్చినది. నేనేమియు ననలేదే? అనవుఁడు జరిగినకథ జెప్పి సగౌరవముగా లోపలికిఁ దీసికొనిపోయెను. బంగారుగొలుసులచే వ్రేలాడుచున్న తూగుటుయ్యెలలో హంసతూలికాతల్పంబునం గూర్చుండి సుందరు లిరుగడ వీచోపు లిడుచుండ మహేంద్రవైభవంబున నృపప్రేషితములగు పత్రికల విమర్శింపుచున్న యమ్మంత్రిపుంగవుం గాంచి యాబైరాగి రెండుచేతుల నాద్వారశాఖల నాని నిలువంబడి తత్వకీర్తనల రచించిన విజయదాసువు నీవేనా? నీవేనా ? అని ముమ్మా రడిగెను.

అప్పు డాసచివోత్తముఁడు తటాలున లేచి నమస్కరింపుచు నార్యా యీ పీఠమున వసింపుఁడు. విజయదాసను లౌకికనామము గలవాఁడను నేనే. మీ రాక దెలియక శ్రమపెట్టినందులకు క్షమింపుడు.

సన్యా - లోకులకు దత్వోపదేశము సేయుచుఁ తుచ్ఛబోగము లనుభవించెడు మిముఁ బోటులకు బీఠములు గాని మాకు వానితోఁ బనిలేదు. ఈ తత్వములు రచించినవాఁడవు నీవేనా?

విజ - స్వామీ! క్షమింపుడు. పీఠ మలంకరింపుఁడు. దైవప్రేరితము బుద్ధిచే వీని రచించినవాఁడను నేనే.

సన్యా - అక్కటా! నీవు పలు కొక్కటియు సేత యొక్కటియుఁ గావింతువా?

మంత్రి - మహాత్మా! నే నట్లు సేయలేదే.

సన్యా - ఓహో! నీ మోహ మింకనుం దెలియకున్నావుగదా! సర్వసంగవర్ధితులు గమ్మని లోకులకు బోధించుచుఁ బామరుండువోలె సక్తుండవై నీ వీతుచ్ఛ