పుట:కాశీమజిలీకథలు -09.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

ర్శించియు నా పేరుగల వానిం దెలిసికొన లేకపోయెను. అతండు గతించెనని నిశ్చయించి వెండియు హరిద్వారంబునకుఁ బోవఁదలంచెను. నాఁటిసాయంకాలమున వీణ మీఁద నా విజయదాసు జెప్పిన తత్వములఁ బాడుచున్న యొక గాయకుంజూచి పాట ముగించునంతవరకు నందుండి యతండు వీణఁ గట్టిపెట్టి వెళ్ళబోవునప్పుడు అయ్యా! మీరు పాడిన తత్వములు జేసిన విజయదా సెవ్వఁడో యెఱుఁగుదురా? అంకితము వలన నీ గ్రామమేయని తేలుచున్నది. అతం డిప్పుడు బ్రతికియున్నవాఁడా? అని యడిగిన నా గాయకుడు అయ్యో! బ్రతికియే యున్నవాఁడు అతండు

క. చతురం భోధి పరీత
    క్షితినాయక నికరమగుట కీలిత రత్న
    ద్యుతి నీరాజిత చరణుఁడు
    మతిమంతుఁడు చక్రవర్తి మంత్రి మహాత్మా!

అనుటయు సన్యాసి అయ్యా! అట్టి ప్రసిద్ధపురుషుని పేరెవ్వరి నడిగినను జెప్పలేక పోయిరేమి? ఆరు మాసములనుండి వృధగ శ్రమ పడుచుంటిని. ఈ మాట యప్పుడే తెలిసినచో నింటికిఁ బోవుదం గదా? అని పలికిన నా గాయకుఁడు అగు నగు నంకితములో విజయదాసని చిన్న పేరున్నది. కాని, అతని యభిక్య పెక్కు బిరుదములతో నొప్పుచున్నది. విజయప్రతాపనృపవేదండకంఠీరవుఁడు. సామాన్యముగా నీవన్నపే రాయనదని యెవ్వరికిం దెలియదు అని సమాధానము జెప్పెను.

చీ, ఛీ మహావిరక్తుండువలె నిట్టితత్వములం రచించి తుచ్ఛములగు సంసారభోగము లనుభవించుచున్నవాఁడా? చాలుఁ జాలు. నిది లోకులను వంచించుటగాఁదా యని పలికిన నతం డేమియు మాటాడలేదు. ఇంచుక సే పాలోచించి యా సన్యాసి అయ్యా! ఆయన మాబోటివారితో మాట్లాడునా? దర్శనమిచ్చునా? అని యడిగిన సరి సరి మీకా దర్శనము! మహాసామ్రాజ్యాధిపతులు వచ్చి ద్వారమున వేచియుండ, నెన్నినాళ్ళకో కాని దర్శనావకాశము గలుగనేరదు. అని యాగాయకుఁడు సెప్పెను. బైరాగి మఱియు నాలోచించి, అట్టి భోగవర్తుం జూడ నతిప్రయత్నము సేయనేల పోవుటయే లెస్స. అని యాలోచించి యటఁ గదలి కొంతదూరము పోయి నిలువంబడి యతండు రచించిన కీర్తనలఁ దలంచుకొని మేను ఝల్లుమన నయ్యో! వాని కొఱకు శ్రమపడి యింతదూరము వచ్చి చూడకుండఁ బోవుట మంచి పని కాదు. చూచి మాట్లాడి యెట్టివాఁడో తెలిసికొని బోవుట యుచితము. పదిదినము లాశ్రయించిన దర్శనము కాక పోవునా! అని మఱలఁ దలంచి మంత్రిగారిగృహమెందున్న దని యడుగుచు మఱునాఁ డుదయమునకు వారి సదనాంగణముఁ జేరెను.

తత్ప్రదేశంబు మత్తమాతంగతురంగమాది మంగళజంతుసంతత్యలంకృతంబై స్ఫటికశిలాఘటితకుట్టిమంబై యొప్పుచున్నది. సమున్నతఫాలవిరాజ మానంబగు మునిప్రసాదంబు నందలి సింహద్వారంబు కార్తస్వరభాస్వరఘృణీకలిత