పుట:కాశీమజిలీకథలు -09.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

గీ. ఱజినములు గుండికలును నర్కాక్షమాలి
    కలును దండము లూను భిక్షులును గొంద
    ఱరుగుదెంతురు నిత్యమన్నార్థులగుచు
    నమ్మఠంబున కమరు ప్రఖ్యాతి నెఱిఁగి.
 
   మరియు నిత్యము -

క. చెంబులు లోటా లంగీ
    లంబరములు శాలువలు గటాసనములు ఛ
    త్రంబులు పాదుకలును నును
    కంబళులును నిత్తురుడుగక విరక్తులకున్.

చ. మారసమాన! యో నృపకుమార! సువస్త్రములిమ్ము, నారు సం
    భారములిమ్ము, నాకు నునుపచ్చడము ల్వెసదెమ్ము నాకు జ
    ల్తారు పంటంబులంచు జడదారులు మూఁగికొనంగ లో నహం
    కారము జెంద కించుకయు కామ్యము లిచ్చు నతండు నవ్వుచున్.

అట్లు కొన్నిదినంబులు గడంచినంత నొక్కనాఁడు రాజపుత్రుఁడు మిత్రునితోఁ గూడ భిక్షువులకు వస్త్రాదికము లిచ్చుచున్న సమయంబునఁ దన్మధ్యంబున దివ్యతేజస్సంపన్నుడును జటామకుటమండితుండును. వ్యాఘ్రచర్మోత్తరీయుండును విభూతిరుద్రాక్షమాలికావిరాజితగాత్రుండు నై రెండవ శంకరునివలె నొప్పుచు నీక్షణంబులు దుర్నిరీక్ష్యంబగు తేజంబు గ్రక్కుచుండఁ జూచినంతనే మహానుభావుండని తెలియఁబడు నొక్కసన్యాసిం బొడఁగాంచి సంతసించుచు నతం డేమియు నడుగకున్నను, మిక్కిలి వెలగల మెఱుఁగులీను జల్తారుశాలువ యొక్కటి యతనిపైఁ గప్పి నమస్కరించెను. అవ్విరక్తుండు ఆ శాలువఁ దీసి చేతులఁ బట్టుకొని మోహనుని మోముపైఁ జూట్కులు నెరయఁజేయుచు రాజపుత్రా! నీదాతృత్వము విచిత్రముగా నున్నదిగదా! విరక్తుల రక్తులఁ జేయుచుంటివి. నీయీవివలన గృహస్థులుగూడ భిక్షుకులగుచున్నారు. పరివ్రాజకుల కీయమూల్యమాల్యాంబరాభరణాదు లేమిటికి? నాకీ శాలువతోఁ బనిలేదు. రామేశ్వరమునుండి వచ్చుచు నీ దాతృత్వ మెల్లరుఁ జెప్పికొనఁగాఁ జూడవచ్చితిని. కాని యీ పచ్చడంబునకై వచ్చినవాఁడగాను. దీని మఱియొకని కిమ్మని పలుకుచు మడతఁబెట్టి యాశాలువ వారిముందరఁ బెట్టెను.

అప్పు డారాచపట్టి యాభిక్షుని పాదంబులఁబుట్టుకొని మహాత్మా! రక్షింపుము. మీ కొక ప్రయోజనము లేకున్నను మద్భక్తినివేదితంబగు పుష్పంబనుకొని దీనిం బరిగ్రహింపుడు. ఎప్పటికైన మీ యట్టి మహాత్ముని దర్శనం బగుననియే యిట్టి యుద్యమము సేయుచుంటి. నేఁటికి గృతార్థుండనైతి. మీ పాదసేవఁజేసి కృతకృతుండ నయ్యెదనని పలికిన విని యతండు చిఱునగవుతో నోహో! మంచియుక్తిపరుండవే! సంతోషమయినది. గూర్చుండుము. అతండు నీ కేమి కావలయునని యడి