పుట:కాశీమజిలీకథలు -07.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశోకవనము కథ

95

అని యందఱును కాలిగొలుసులు తెగునట్లు చిందులు ద్రొక్కఁ దొడంగిరి. అప్పుడు రక్షకభటులు వారింగశలచే బాది యదలించుచుఁ గూర్చుండఁబెట్టి మీ యలజడి యేమి యేమి యని అడిగిన అయ్యా మాకు నరవాసన గొట్టినది. చిరకాల మైనను దినిన నోళ్ళగుట అమ్మాంసము నందలి లాలసత్వముచే నిలువలేక గంతులువైచితిమి. ఇది ప్రమాదము క్షమింపుడు అని‌ వేడికొనిరి. రండలారా ? ఇక్కడికి మనుష్యులెట్లువచ్చిరి వచ్చిననో భక్షింతురా యేమి? రాజశాసనము మరచితిరా? ఇఁక మీరిన శిక్షింతుముజుడి అని‌ వెఱపించుచు యధాగతముగా వారినెల్ల శ్రీరామ మంత్ర జపరాయణులం గావించిరి. అంతకుఁ బూర్వమే యా ప్రాంతమున నిలిచి యా వింతలం జూచుచు వారి సంభాషణము లాలించుచున్న వీరసింహుండు మనంబున నిట్లు తలంచెను.

ఔరా? ఈరక్కసుల వికృతరూపములు హఠాత్తుగా జూచిన నరులకు నుల్లములు తల్ల డిల్లక మానవు. అన్నన్నా? ఈ ఘోరాకారము లనడుమఁ గర్ణ కఠోరములగు తర్జన భర్జనములకోర్చి‌ మహాపతివ్రతయైన సీతామహాదేవి యెట్లు నివసించినదో తెలియదు. చిరకాలమైనను వీరి ప్రలాపములు దుర్బరముగా నున్నవి. ఆహా ! ఇట్టి వాండ్రనెల్లఁ గాళ్ళకు సంకెళ్లు వైపించి రామమందిరముచుట్టునుఁ గూర్చుండఁబెట్టి జన్మతారకమగు రామనామము జపింపఁ జేయుచున్నారు. విభీషణుఁడెంత కృతజ్ఞుఁడో ఎట్టి పరమార్దవేదియో, ఎంత వివేకశాలియో, నర కళేబరములఁ జెఱుకుముక్కలవలె విఱచుకొనితినియెడు దానవులకు మాంసభక్షణము నిషేధముజేసి శాకభక్షులనుఁ గావించిన విభీషణుని వంటి దయాశాలి యెందైనం గలఁడా ఔరా? నేనెట్టి పుణ్యము జేసికొంటిని? త్రేతాయుగమునాఁటి వింతలం జూడగంటిని. రామాయణకథ వినుటయే గాని చూచినవారుండిరా. రామలక్ష్మణులకుఁ దక్క మనుష్యులకీ లంకాపురము ప్రవేశింప వశమా? మహాపుణ్యాత్ముండైన విభీషణునిం జూచి జన్మము సాద్గుణ్యము జేసి కొందును. అహా హా ఎక్కడి లంకాపట్టణము. యెక్కడి యుజ్జయిని. యెక్కడి వీరసింహుడు మాముత్తాత విక్రమార్కుని సుకృతమే నాకీఫలము గలిగించినది. నా వాసనగొట్టినంతనే గంతులువైచిన యీరక్కసిముండలు రత్నగుప్తుఁడను గానిచో గుహలవలెనున్న తమ నోటిలో వైచికొనకపోవుదురా? కానిమ్ము ప్రచ్ఛన్నముగానే యీలంకాపట్టణమంతయుం దిరిగి చూచెదంగాక. ఇందలి ప్రకటనా పట్టములే పట్టణపువింతలఁ జెవ్ఫకయే తెలియఁజేయఁగలవు. ఇది ప్రాతలంకకు మార్గ మఁట. ఆ కనంబడు మేడలన్నియు శిధిలములై యున్నవి విభీషణుఁడు పూర్వపులంక విడిచి దక్షిణముగాఁ గ్రొత్తపట్టణము నిర్మించుకొనినట్లు రాజభటుల మాటల వలనం దెలిసినది. ఇది అశోకవనమునకు మార్గమఁట ఈదారివోయి అందలి విశేషములం