పుట:కాశీమజిలీకథలు -07.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వెరగుపడుచు నిది పెంపుడు మృగమా? కానిచో నిట్లు నాచెంత నిలుచునా యని తలంచి ఓహో ? తెలిసికొంటి నిమ్మణిధారణంబున దీనికి నేను గనంబడలేదు. దానం జేసి నిశ్శబ్దముగా నిందుబండుకొన్నది. కానిమ్ము, ఖడ్గహస్తుండనైన నన్నిది యేమి చేయఁగలదు. దీనిపై కెక్కి చూచెద గుఱ్ఱమువలె నడిచిన నుపకారమే యగు కానిచో మడియఁజేసెదనని తలంచి యది లేచి నిలువంబడి యెక్కడికో పోవయత్నించు సమయమున నుపాయముగా దానిపై కెగసి కూర్చుండి నడుము కాళ్ళతో అదిమిపట్టి కేసరముల గట్టిగాఁ బట్టుకొని యదలించెను.

అప్పుడా పెనుమెకంబు నాకంబు విరిగి మీఁదబడినట్లు వెరచుచు నెఱుకలు గలదివోలె నెరిగి‌ యెరిగి శరవేగంబునఁ బారఁదొడంగినది. వృక్షశాఖగుల్మాదుల నవలీల లంఘించుచు నాపంచాస్యంబు యామద్వయకాలం బేకరీతి బరుగిడి దారుణ కాంతారములు పెక్కులు దాటి యొక మేటిగిరి శృంగాటంబున నిలిచి గప నశ్రమచే నలసివివశయై నేలంబడినది.

అప్పుడా వీరసింహుండు తన్నుబునర్జాతులగాఁ దలంచి పుడమికి దిగి మేనెల్ల జెమ్మటల గార నిట్టూర్పులు నిగుడించుచు నొడలెఱుంగక పడియున్న ----- ర్యక్షమును జూచి జాలిపడి పాదములొత్తుచు నాకులచే విసరుచు సేదదీర్చఁ దొడంగెను.

అప్పటికి రెండుగడియల ప్రొద్దున్నది. అతండు ప్రొద్దు దిక్కు మొగంబై పరిశీలింపుచుండ నాసింగం బట్టేలేచి రివ్వున నెగిరి యొక మూలకుఁ బారిపోయినది. ఆవింతజూచి అతండు ముక్కుపై వ్రేలిడు కొని యౌరా? ఈమహారణ్య మీమృగరాజం బల్పకాలములో దాటించినది. పాదచారినై సంవత్సరముకైనను దీనిం దాటఁజాలను. రమణీయోద్యాన భాసురమగు నీగిరికూటము జేరుటకును నాకు శక్యమా? పెక్కేల శ్రీమన్నారాయణుని యాద్యావతారములు నాలుగును నాకీ యుపకారము గావించినవి. మత్స్యంబు మణిహార మర్పించినది. కూర్మంబు సాగరంబు దాటించినది వరాహంబు గట్టెక్కించినది. సింహంబు మహారణ్యంబు దాటించినది. ఇది యేదేశమో తెలియదు ఓహోహో దక్షిణముగాఁ జూచిన గొప్ప పట్టణము నేత్ర పర్వతము గావించుచున్నది మెరపుతీగెయంబోలె వీఁటిచుట్టును గాంచనప్రాకారము కాంతులీనుచుఁ గన్నులకు మిరిమిట్లు గొల్పుచున్నది. భూలోకనగరము లిట్టి శోభ గలిగియుండునా?

ఈరాజధానికీ శైలము క్రీడాశైలము కాబోలు. ఇందలి భవనములు విచిత్రరత్న ప్రభాయుతములై కన్పట్టుచున్నవి. ఈపట్టణ రాజమును జూచి కన్నులకలిమి సాద్గుణ్యము నొందఁ జేసికొనియెదను భానుండపరగిరిపరిసరము జేర్చుచున్నవాఁడు నేఁటి