పుట:కాశీమజిలీకథలు -07.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరసింహుని కథ

91

నీధాత్రీ ధరకూటమున వసియించి ఱేపు పోయెదం గాకయని తలంచి యందు నలు మూలలు తిరిగి యొక క్రీడాసౌధము యందలి యఱుగుపయిం గూర్చుండి యందలి వింతలం జూచుచుండెను.

ఇంతలోఁ జీకటి‌ పడినది తన మెడలోనున్న రత్నహారము కాంతుల పండు వెన్నెలను గాయుచుండ వీక్షించి యదివస్త్రచ్చన్నము గావించి తలక్రిందనిడుకొని పండుకొనియెను. అప్పుడాప్రాంతమున నిద్దరుపురుషులిట్లు సంభాషించుకొనిరి.

నరాంతకుఁడు -- దుర్ముఖా! నేను రాననుచుండ బలవంతముగా నేకాంతయు జెప్పదనని నన్నీత్రికూటమునకు తీసికొనివచ్చితివి అదియేదియో చెప్పుము.

దుర్మ -- మిత్రమా! నరాంతక ! అస్మత్స్యామి పుత్రుడగు విద్యుజ్జహుఁడు విభీషణమహారాజు గారి పుత్రిక చంపకను వరించి యున్మత్తుండై తిరుగుచున్నాడను వార్త నీవు వినియంటివా?

నరా - వినలేదు ఆదుర్మతికి భర్తృదారిక నిత్తురా? వాని పిచ్చియేకాని లాభములేదు రావణబ్రహ్మతోనే వాని బాంధవ్యము తెగిపోయినది.

దుర్మ - ఆమాట సత్యమే. పెద్ద విభీషణునికి శూర్పణఖ సంతతి పేరు తలపెట్టినఁ గోపము పెద్దగా వచ్చును. వారికిష్టము లేకున్నను వీని కోరికకేమి అభ్యంతరము

నరా -- అగును ఫలములేకున్నను మనోరధము లనేకములుండ వచ్చును. తరువాత

దుర్మ - నేఁడు పుణ్య దివసమగుట విభీషణ మహారాజు మనుమనితోఁ గూడి రంగనాధు నారాధింప భూలోకమున శ్రీరంగమున కరిగెను.

నరా - అట్లుబోవుట వారికి వాడుకయై యున్నది. ఉచితమే శ్రీ రామదత్తంబయిన రంగనాధుని విమానము అతండు లంకాపురంబునకుఁ దీసికొనివచ్చుచుండ కావేరికోరిక లీడేర్ప నాస్వామియందు స్థాపితుండయ్యె కాకున్న శ్రీరంగము లంకాపురములో నుండకపోవునా?

దుర్మ -- జయవకాశమరసి విద్యుజ్జిహ్వుఁడు నేటిరాత్రి అత్తలోదరి యంతఃపురమున కఱిగి శాంబరీ పాటవంబున నీకూటంబునకు దీసికొని వచ్చునఁట.

నరా - ఓహో? పులిమీసములు లాగుటకే బ్రయత్నించుచుండెనే పెద్ద విభీషణుని శాసన మతిక్రూరమని యెరుఁగఁడు కాబోలు

దుర్మ - కామాంధునకు యుక్తాయుక్తవివేక ముండదుగదా అది యట్లుండె స్వామి విమోచన మెట్లయినను సేయక దీరదుకాదా.