పుట:కాశీమజిలీకథలు -07.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12]

వీరసింహుని కథ

89

తాబేలై యుండవచ్చును. దీనిం దీరమును జేరియుండుటచే నేలయే యనుకొంటిని. ఇప్పుడిది మహావేగముఁగా బోవుచున్నది. కమఠరూపుఁడైన శ్రీహరియే నన్నె త్తికొని పోవుచున్నాఁడు. ఇఁక నాసంకల్ప మీడేరఁగలదు. ఇది సముద్ర మధ్యమునకుఁ బోయి మునుఁగును. నేనును మునిఁగి పాతాళలోకమున కరుగుదును. నాకు దైవ మనుకూలుఁడై యున్నట్లు తోచుచున్నది లేకున్నఁ ద్రిలోకాశ్చర్యకరమగు దివ్యమణిం దెచ్చి యామత్స్యంబు నాపాదములమీదఁ బడవిడుచునా ? అని యత్యంత సంతోషముతో దలంచుచుఁ బరమేశ్వరువి దయకు స్తోత్రములు జేయుచుఁ బెన యోడ మీదం బలె నతండు నిర్భయముగానందు విహరింపుచుండెను. అంతలో బద్మినీకాంతుడస్తాచల మలంకరించెను. క్రమంబునఁ పికటులు నలుమూలలు వ్యాపించినవి. అప్పు డంతా కమఠవృష్టంబున వసించి కన్నులుమూసికొని ధ్యానించుచు నారాత్రి నిద్రబోలేదు మరునాఁడుదయమునఁ గన్నులువిప్పిచూడ నాతాబేలొక యొడ్డునఁ జేరియున్నది. అందుగల వృక్షలతాగుల్మాదు లతనికి నేత్రపర్వముగావించినవి. అప్పుడా రాజకుమారుం డౌరా ! నేను సముద్రాంతరమున మునుఁగుదమనుకొన్న నది మరల తీరమునకు దెచ్చినది ఇది యే దేశమో తెలియదు. ఒడ్డు గోడవలె నుండుటచే నెక్కుటకు శక్యముకాదు. దూరము చూడ నిదియొక పర్వతమువలెఁ గనంబడుచున్నది. పైకెట్లు పోవువాఁడనని యాలోచించుచు నాదెసఁబరిశీలించుచుండెను.

అప్పుడొక అడవిపంది యాగట్టుపైనుండి నీటిదెసఁ దొంగిచూచి దిగవలయునని ప్రయత్నము చేసినది నూయివలె నుండుటచే శక్యమైనదికాదు. అప్పుడది యిటు నటు తిరిగి తనదలష్టాగ్రంబున నేల విరజిమ్ముచు గునపముతోఁ ద్రవ్వినట్లు పొడిచి పొడిచిసోపానములు చేసికొని యాసముద్రములో దుమికి జలక్రీడగావింపఁదొడంగినది.

రాజపుత్రుఁ డవ్వింత కచ్చెరువందుచు మెల్లనదిగి యదిగావించిన మెట్లవెంబడిని పై కెగబ్రాకెను. అతం డొడ్డుపైకెక్కి తానెక్కి వచ్చిన కూర్మమము జూడ నది యంతలో సముద్రమున మునిఁగినది. ఆ తాబేలును దైవమేయని తలంచి యతండు స్తుతించుచు అటఁగదలి కొంచెముదూరము నడిచినంత సింహశార్దూలాది మృగ భయంకరమైన యొక యరణ్యము గనంబడినది. అయ్యడవియందు నడుచునప్పుడా రాజమారుడు భగవంతుడు తనకు సహాయము గావించెనని సంతసించుచు మధ్యాహ్నము దనుక నడిచి అయ్యడవి కంతము గనంబడమి గమనాయాసమున వాయ నొక చెట్టునీడ విశ్రమించియుండ అచ్చటికొకసింగం బరుదెంచి యందె విశ్రమించినది.

తన్ను జూచి బెదరక పండుకొనియున్న యాకేసరిం జూచి వీరసింహుఁడు