పుట:కాశీమజిలీకథలు -07.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

కాశీమజిలీకథలు - సప్తమభాగము

యడుగున మ్రోలఁబడినది. రత్నాచ్ఛాదితమగు శుభ్రాంశుకముభంగి మెరయుచున్న యామీనుంజూచి యతండు వెరగుపడుచుఁ దనచేతినున్న కత్తికొనఁ దదురగోళంబు ఛేదించి నంత నద్భుత ప్రభాపటల విరాజితమగు రత్న మొండు గన్నుల పండువు గావించినది.

అబ్బురపాటుతో దానింగైకొని నీళ్ళచే గడిఁగి పరిక్షించుచు నిది దేవతామాణిక్యమువలెఁ బ్రకాశించుచున్నది. సముద్రమునకు రత్నాకరమని పేరుగలిగి యున్నది గదా ! దీనిం జేపలుమ్రింగియుండ వచ్చును కాదు కాదు ఇది మండనము జేయబడినట్లు గురుతులు గనంబడుచున్నవి. నాగలోకములో దివ్యమణులున్నవని ప్రసిద్ధిగాఁ జెప్పికొందురు. పాతాళమునకు సముద్రమునుండి మార్గమున్నట్లు నిశ్చయింపవలసినదే. ఇది నాగకన్యలు ధరించుమండనము నాకిది శుభసూచకమని తలుచుచు రంధ్రములున్న యామణికి త్రాడుగ్రుచ్చి మెడలో వైచికొనియెను. అది యతని యురమున మిక్కిలి ప్రకాశించినది. యేమిటికో ప్రమాదమున జేయిజారి యదినేలం బడిన నతని కన్నులకుఁ గనంబడినదికాదు.

అయ్యో ? నాకీరత్నంబు ప్రసన్నమై తిరోహితమైనదేమి ? నే నేమియపచారము గావించితిని? ఎవ్వరి నిందించితిని. ఇట్టి మణి ధరించుటకు నేనర్హుండగానా? మెడలో వైచికొనుటతప్పా ? అగును బూజింపవలసినది తాల్చుట తప్పేయని పరి పరిగతులం దలంచుచు నా ప్రాంతమందుఁ జేతులతోఁ దడిమి వెదకెను. ఒకచోట నతని చేతికిఁ దగులుకొని కన్నులపండువ గావించినది. అతండొండు రెండుతేపలారతనంబును విడిచి పట్టుచు దాని మహిమ తెలిసికొని యోహో ? నిక్కము గ్రహించితి ఇది మేనికిఁదగిలిన దృశ్యమగు లేనిచో నదృశ్యమగును. దీనింధరింప నేనును నొరులకు కనంబడును. ఇది మంచిసాధనమేయని తలంచుచుఁ బరమానందముతోఁ బృథు గుణంబున దాని గట్టి మెడలోవైచికొని యాతీరమున నడుచుచుండెను.

కొంతదూరమఱిగిన నంత నొకచోట సముద్రములోనికిఁ ద్రోసికొనిపోవ తిన్నెయొకటి గనంబడినది. దానిపైకెక్కి నడచుచు వీరసింహుఁడౌరా ? యీభూమి యింత కఠినముగానున్నదేమి ? సైకత చిహ్నములులేవు. లంకభూమియుంగాదు ? రాతినేలయుంగాదు. వింతగా నున్నది సముద్రతీరమున నిట్లుండుగాబోలునని యంచునకుఁ జేరవలెనని వడిగా నడుచుచుండెను.

కొంతసేపటికి కదలుచున్నట్లు పొడకట్టినది. భూకంపమని మొదట నిశ్చయించి తరువాఁత దీరమునకు దూరమగుచు నదియొక జలజంతువని తెలిసికొని యతండిట్లు తలంచెను. ఆహా ! విధివియోగములు కడుసుచిత్రములుగదా ! ఇది