పుట:కాశీమజిలీకథలు -07.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరసింహుని కథ

87

గనే పోవలయునని తలంచి తల్లి మాటకంగీకరించు వాఁడుబోలె నభినయించుచు ననుజ్ఞ పుచ్చుకొని నిజనివాసంబునకుఁ బోయెను.

తమవారు పాతాళలోకముననున్నవారని వినినదిమొదలాలోకమునకు మార్గ మెట్లని యాలోచించుచుఁ బండితుల నడుగుచు గ్రంధముల విమర్శింపుచుండెను.

శో. ఏతత్తు నాగలోకన్య నాభిస్థానే స్థితంపురం
    పాతాళమితి విభ్యాతం దైత్యదానవసేవితం.

నారదుండు మాతల్లిందీసికొని వరుణలోకము మీదుగాఁబాతాళ లోకమున కరిగినప్పుడా యా యా లోకవిశేషంబులు శ్రీమహాభారతంబున దెలుపఁబడియున్నవి. వానిం జదువుకొని వీరసింహుడు సముద్ర మధ్యమున దుమికినఁ బాతాళము గనంబడు నని నిశ్చయించుకొని యట్టి సన్నాహము గావించుచు నొకనాఁడు వేకువజామున నెవ్వరికిం దెలియకుండ బయలువెడలి దక్షిణాభిముఖుండై పోయి పోయి కొన్ని దినంబులకు సముద్రతీరము సేరెను. అప్పటికి జాముప్రొద్దుమాత్రమే యుండెను.

సముద్రమును జూచి యతండు వెరగుపడుచు నాహా ఈ మహాసాగరమును సంసారముతో విద్వాంసులు పోల్చియున్నారు. ఈతరంగములవలె నందు సుఖదుఃఖములు పరంపరలు వచ్చుచుం బోవుచుండును. ఇక్కల్లోలము లొకక్షణమైన నేకరీతినిలువవు ఒక్కొక్కటి కొంతపొడవున పైకిలేచి కొంతదూరమువచ్చి తిరిగి యడంగిపోవును.వేరొకటి దానంజనియించి యింకొకదానికి జనపహేతువగు చుండును. ఇంచుకయు గాలి లేకున్నను నీతరంగంబు లింత ఘోషముతో వెల్లువలుగా నెగయుచుండుట కేమికారణమో నిజమెఱింగినవారులేరు.

ఇది యరణ్యదేశము. ఓడ యేదియుం గనబడదు. సముద్రాంతరంబున కెట్లు పోవువాఁడనో తెలియదు. అని యాలోచించుచు నా రాజపుత్రుండు తత్తీరదేశమున నడచుచుండెను.

సముద్రుండతిధికిఁ బార్యమిచ్చుచున్నవాఁడో యన జిన్నయల లతని యడుగులం గడిగి వెనకకుఁ బోవుచుండును పర్వతములవలె బొంగివచ్చు తరంగములకు వెరచి యతండొడ్డుదెసకుఁ బరచుచుండనవి యందే యణంగుచుండును. వేరొకటి చిన్నదియని నిర్లక్ష్యముగా నడువ దానికింకొకటి తోడుపడి మెల్లగావచ్చి కంఠదఘ్నమై యతని జలకమాడించుచుండును.

ఒక్కొక్క తరంగమున గంపతోఁ బోసినట్లు శంఖములు గవ్వలును గుమ్మరించుచుండును. అట్టి వింతలం జూచుచు నతం డతివినోదముగా నాసముద్రతీరమున నడుచుచుండ నొకచో సద్యోగతాసువగు చేపయొకటి తరంగముల రాయిడి నతని