పుట:కాశీమజిలీకథలు -07.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మ. జననీ! యేమిటి కిన్నినాళ్లు వగఁబ్రచ్ఛన్నంబు గావింతు మ
     జ్జనకోదంతము దండ్రిలేడనియె నిచ్చన్‌ గుందుదున్‌ రాజు నం
     జనమంచున్ ధనమంచుఁ బారుఁడు దురాచారుండు గొంపోయెనే
     వనికిన్ సత్యము జెప్పుమమ్మ తగఁ ద్వార్తల్‌ విమర్శించెదన్‌.

అయ్యో తల్లీ? నాకు బుద్దివచ్చి యెనిమిదేండ్ల యినది. అప్పుడే నాకీకథ యెఱింగించిన నీపాటికి మా తండ్రిం దీసికొని రాకపోవుదునా అక్కటా! యెవ్వరి నడిగినను మా తండ్రి లేడనియే చెప్పిరి. కాని ప్రవాసము దీసికొని పోఁబడెనని యొక్కండును జెప్పకపోయెను. ఫై పెచ్చు చెప్పినవానిని శిక్షింతుమని శాసనము జేసితిరట. ఆహా ! యెంత చోద్యము. అని యడిగినఁ గుమారునికిఁ దల్లి యిట్లనియె.

నాయనా ! ఈ వార్త నీకెరింగించిన వగతువుకాని నీవేమి జేయఁగలవు. అందులకై అట్టి శాసనము జేసితిమి. ఇందు మంత్రుల తప్పులేదు. వినుము మీతండ్రి మరణమనిన వెరవరు. దేహమును దృణముగాఁ జూచుచుందురు. ఎవ్వడో మాయావి బ్రాహ్మణ వేషంబున వచ్చి నిక్షేపమున్నదని నెపముపన్ని తీసికొనిపోయెను. మీ పెద తల్లి కలభాషిణి తొమ్మిదిమాసములు నిండియున్నది. యంతఃపుర కాంతులు వలదనుచుండ వినక యందల మెక్కించి తీసికానిపోయిరి. వాఁడు బ్రాహ్మణుఁడు కాడు రాక్షసుడు. మా యవ్వకు సోదరుఁడు రక్తాక్షుఁడై యుండును. నారాక విని కోపించి మీతండ్రి నెత్తుకొని పోయెను. వాని నివాసము పాతాళ లోకమున కడుగుననున్న తలా తలము అక్కడకుఁ దీసికొనిపోయి యా దంపతుల దాచియుండును. వారిం జంపుటకు వానికి సామర్థ్యము లేదు. మీతల్లిదండ్రులు జీవించియున్నవారని నాకు దృఢమైన నమ్మకముగలదు. ఎప్పటికైనఁ దప్పించుకొని రాఁగలరని స్వప్న మూలమునఁ దెల్లమైనది. నీవు విచారింపవలదని బోధించిన విని వీరసింహుండు అమ్మా ! మా పెత్తల్లి‌యుం బోయెనా? అయ్యో? ఆమెప్రసవమై మగవానిఁగనిన నాకన్న యగునా, తమ్ముడగునా, చెప్పుము అనుటయు నామె కన్నీరుగ్రమ్మఁ తండ్రీ నీకు నన్నయే యగును అని యుత్తరముజెప్పినది.

అప్పుడతండు అమ్మా ! గతమునకు వగచినఁ బ్రయోజనములేదు వారు పాతాళముననున్నను స్వర్గముననున్నను వెదకి తీసికొని వచ్చెద నన్ననుపుము దృఢనిశ్చయునకుఁ గార్యసాఫల్యముగాక మానదు. అని యడిగిన హేమప్రభ చాలు జాలు పట్టీ! ఇట్టి యూహలెప్పుడును జేయకుము వారే రాఁగలరు. పాతాళమునకు మనష్యులుపోవఁ జాలరు. రాజ్యభారము వహించి ప్రజలం బాలింపుము. పిచ్చిమాట లాడకుమని బోధించిన నతండు ఆత్మగతంబున నోహో ? ఈమెతోఁ జెప్పిన సమ్మతింపదు. చెప్పకుండఁ