పుట:కాశీమజిలీకథలు -07.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరసింహుని కథ

83

పర్వతప్రాంతమున వసించియున్న విజయభాస్కరుని పరిజనులు సాయంకాలము దనుక నందుండి రాజదంపతులం దీసికొని వచ్చుటకై యందలముతో శిఖరదేశమున కరిగిరి అందెవ్వరి జాడయుఁగనంబడ లేదు. మఱ్ఱిచెట్టు క్రింద వేదిక మధ్యమున నగ్ని బ్రజ్వరిల్లుచున్నది. అప్పుడు మిక్కిలి తొట్రుపడుచుఁ గొండగుహలు ప్రతిధ్వనులిచ్చునట్లు మహారాజా? విజయభాస్కరా? అని కేకలు వేయఁ దొడంగిరి. అతని ప్రతిధ్వని‌ యే మూలనుండియు వినక పరిజనులు హాహాకారము సేయుచు అయ్యో? ఆ బ్రాహ్మణుఁడెవ్వఁడో మాయావి రాజదంపతుల నేమి జేసెనో తెలియదు. తెలియక మోసపోయితిమి. అందరని దూరముగా బొమ్మనిన నేమోయనుకొంటిమి హా! మహారాజా ! ధర్మశీలా! హా పరోపకారనిరతా ! అని దుఖించుచు నా పర్వతమంతయు వెదకి యరణ్య భూమును పరిశీలించి యత్యంత దుఃఖాక్రాంత స్వాంతులై నాలుగు దినములకు దిరుగ నగరముజేరి మంత్రుల కత్తెరంగెరింగించిరి.

అప్పటికి రెండు దినములక్రింద హేమప్రభ ప్రసవమై మగశిశువుం గనినది. మహారాజుగారి వార్తకొరకుఁ బ్రజలెదురుచూచు చుండిరి. నిజమైన వార్తవినిమంత్రులు విచారసాగరమగ్నులై పురిటిదినములు పదియు దాటుదనుక నా కథ హేమప్రభ కెఱుంగనిచ్చిరికారు. నలుమూలలకు రాజద౦పతుల వార్తఁదెలిసికొన సమర్థులైన వీరభటులఁ బెక్కండ్రఁ బంపిరి.

హేమప్రభయుఁ బదొకండవ దివసంబున మంత్రుల వలన భర్తృప్రవాస ప్రకారంబువిని యడలుచు నొడలెఱుంగక మూర్ఛ మునిగినది. విజయభాస్కరుని తల్లియు నావా ర్తవిని యుల్లము భేదిల్లఁ తల్లడిల్లుచు గుమారుని గుణముల నగ్గించి యతండు దైవబలసంపన్నుఁడు శత్రువుల బరాభవించి యెట్లో రాగలడని కోడలి కుదుట గరపుచు దేశమరాజకము గాకుండ రాజ్యతంత్రము లన్నియు హేమప్రభ యనుమతిని మంత్రులు జూచునట్లుగా నియమించి తదన్వేషణమునకై మిక్కిలి రొక్కము వ్యయ పరచుచుండెను.

హేమప్రభకు బొడమిన పిల్లవానికి నాకార లక్షణములు పరీక్షించి విద్వాంసులు వీరసింహుఁడని పేరు పెట్టిరి.

గీ. చేరలకుమీరు కన్నులు బేరురంబు
    తళుకు జెక్కులు ముద్దులు గులుకు మొగము
    దీర్ఘ భాహులు గల్గి యెంతేని వింత
    కాంతిఁ జూపర కద్భుతఁ బ్రాంతిగొలుప.

వీరసింహుడు దినదిన ప్రవర్థమానుండై సింహకిశోరము భాతిఁబరాక్రమ