పుట:కాశీమజిలీకథలు -07.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

కాశీమజిలీకథలు - సప్తమభాగము

రించుచు ఆర్యా ! మీరే కార్యమునకై వచ్చితిరి? సభకేల రారైతిరి? మీ యభీష్ట మెరింగింపుఁడని అడిగిన నా భూసురుం డాశీర్వచన పూర్వకముగా నిట్లనియె.

దేవా ! మాది దక్షిణదేశము. నా పేరు సుముఖుడందురు. వాస్తుదేవతా భూయిష్టమగు కోటలోనికి వత్తునేని వాస్తుదేవతలు ముందరి కార్యమునకు విఘ్నములు చేయుదురు. అందులకై లోపలకి రాలేదు. నేను సమస్త విద్యలం జదివితిని. అంజన ప్రభావంబున నెక్కడ నిక్షేపములున్నదియుం జెప్పఁగలను. వాని నరయుటకై గిరినదీ పక్క ణారణ్య భూములఁ దిరుగచుందును. యీనగరమునకు దక్షిణముగా నున్న యరణ్యములోని పర్వతకూటమున మర్రిచెట్టుక్రింద బెద్ద నిక్షేపమున్నది దానిఁ పరిశీలించి వచ్చితిని. భూతభేతాళములు దానింగాచికొని యుండును. దేవర పట్టమహిషితోవచ్చి ఖననప్రారంభము గావింతురేని నిక్షేపము లభింపఁగలదు. మంత్రబలంబున భూత భేతాళములు విజృంభించకుండఁ గట్టివైచెదను. అందు దేవరకు సగబాలు బంచియిచ్చెదను. ఇక్కార్యంబునకు సహాయము గావింప దేవరం బ్రార్ధించు చున్నవాఁడ నిదియె నా యభీష్టమని తెలిపిన విని నవ్వుచు విజయ భాస్కరుండు ఆర్యా! మీ నిక్షేపములో నాకు సగమీయ నక్కరలేదు. అంతయు మీరే తీసికొనిపొండు. మే మెప్పుడక్కడకు రావలయునో చెప్పుఁడు. వచ్చి మీరు చెప్పినట్లు చేయుదుమని పలికిన విని యా బ్రాహ్మణుండు మిగుల నభిన౦దించుచు దేశకాలము విశేషంబుల నిరూపించి చెప్పినాగిరి శిఖరంబున కరిగెను.

అంత నిరూపింపఁబడిన దివసంబున విజయభాస్కరుం డుచిత పరివారముతోఁ గూడికొని కలభాషి నందలం బెక్కించి తను దురగారూఢుండై బయలు వెడలి మెల్లిగ నా గిరిపరిసరథరణి కరిగెను.

వారి రాక వేచి యందున్న యాపారు శిష్యులిద్దరు పరివారము నంతయు నందే యుండ నియమించి యందలములతో రాజు భార్యను రాజును మాత్రము శిఖరంబునకుఁ దీసికొని పోయిరి. ఆ కూటంబున నా జన్నిగట్టు మర్రిచెట్టుక్రింద నగ్ని వేల్చుచు విజయభాస్కరుని నమస్కారము లందుకొని వారి నందుఁ గూర్చుండ నియమించి శిబివాహకుల గొండ క్రిందికింబోవు నట్లాజ్ఞాపించెను.

రాజును రాజు భార్యయు శిష్యులును సుముఖుండు తప్ప నందెవ్వరు లేరు. పరిజనమంతయు దూరముగా నున్నది. అప్పుడా సుముఖుఁడు లేచి రాజదంపతులఁ దూరుపుముఖముగా నిలువంబెట్టి కన్నులు మూసికొమ్మని చెప్పి ముకుళిత నేత్రులై యున్న యారాజదంపతుల హఠాత్తుగాఁ దన దేహమును బెంచికొని వారి నిద్దరఁ జెరి యొక బుజముపై నిడికొని శిష్యులు వెంటరా వియద్గమంబునఁ దక్షిణముగా నెందేనిఁబోయెను.