పుట:కాశీమజిలీకథలు -07.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11]

వీరసింహుని కథ

81


శ్రీరస్తు

కాశీమజిలీకథలు

సప్తమ భాగము

115 వ మజలీ

మహాత్మా ! యీ యవనధంబు విచిత్ర విషయసూన్యంబగుట నడుగవలసిన విశేషంబేమియుఁ గనంబడలేదు మఱియు విక్రమాదిత్యుని మనుమఁడు విజయభాస్కరుని చరిత్రము వినినది మొదలు నా చిత్తము తదీయ సుగుణాయుత్తమై యున్నది. అతండు కలభాషిణి హేమప్రభలతోఁ గూడికొని యుజ్జయినీ నగరంబు బ్రవేశించి పట్టాభిషిక్తుండయ్యెనని యెఱింగించితిరి గదా !

ఆ రాజపుత్రుని తదనంత రోదంతం బెట్లుండునో వినవేడుక యగుచున్నది. పరోపకారపారీణుండగు నమ్మహానుభాపుండు లోకోపకారకమగు కార్యంబు లేమేమి గావించెనో దివ్యరత్న ప్రభావంబునం దెలిసికొని వివరింతురే యని ప్రార్థించినవిని మణిసిద్దుండు మిగుల సంతసించుచు నా రత్నంబు మ్రోల నిడికొని పూజించి విదితోదంతుండైయబ్బురపాటుతో నౌరా ! నీ వడిగిన విషయంబేదియుఁ జమత్కార కథారహిత౦బై యుండదు. ఏతత్సరిత్రంబు కడు చోద్యంబు సావధాన మనస్కుండవై యాకర్ణిపుము.

వీరసింహుని కథ

సకలసంపత్ప్రభాకరంబగు నుజ్జయినీ పురంబునఁ దేజోభాస్కరుండగు విజయభాస్కరుండు సుజనలోక బాంధవుండై విబుధమిత్రుండై దివ్యప్రభాసంపన్నుడై రాజ్యంబు గావింపుచు నొకనాఁడు కొల్వుకూట మలంకరించియున్న సమయంబునఁ బ్రతీహారిజనుదెంచి జోహారుజేయుచు దేవా ! దూరదేశ వాసియగు భూసురుం డొకండు ఇరువుర శిష్యులతో వచ్చి గోపురాసన్నవేదిక యందున్నవాఁడు. భవద్దర్శ నాభిలాషి‌యై యరుదెంచెనఁట. దేవరకు విన్నవింపుమని కోరుకొనియె. సెలవేమి యని అడిగిన నతండు బాలిశా ! ఎన్నిసార్లు జెప్పవలయును. బ్రాహ్మణుల రాకకు సెలవవసరము లేదని నియమింపలేదా ? పో? పొమ్ము వేగఁ బ్రవేశ పెట్టుమని యాజ్ఞాపించెను

ఆ ద్వారపాలుఁడు పోయి వెండియువచ్చి స్వామీ ! యాతండిందురాఁడఁట. దేవరతో నేదియో చెప్పుకొనునఁట. అక్కడకే దయచేయుమని ప్రార్థించు చున్నాఁడని యెఱింగించిన నారేఁడు దిగ్గున లేచి మొగసాలకరిగి యందున్న విప్రునకు నమస్క