పుట:కాశీమజిలీకథలు -07.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఆ యోగసక్త లవంగియై బ్రాహ్మణ పుత్రిక యయ్యు పాదుషా కూతుఁరను వాడుక వడసినది జితవతి కుపకారము చేసిన పెద్దపులియే పాదుషాయైనది రెండవ పులి యతనికి మంత్రియైనది. పండితరాయలును లవంగియు నాజన్మంబునఁ గొన్ని యిడుమల గుడిచియు శాపావసానమున గంగాగర్భంబునం బ్రవేశించి వసురూపంబులం దాల్చి వసులోకమున కరిగిరి. తెలిసినదియా? యని యడిగిన గోవ కుమారుండు పరమానందభరిత హృదయుండై యా కథ పలుమారు జ్ఞప్తికిఁ దెచ్చు కొనుచు అయ్యవారి కనేక దండములు గావించెను.

ఉ. ఊరక చేతితోడఁ దలనున్న తృణావళి దీసినంత బం
     గారము కోటియిచ్చిన ప్రకారమున న్ముదమందు సజ్జనుం
     డారసి ప్రాణదానముననైన నొనర్చు మహోపకారము
     న్వైరముగాఁదలంచి యుపవాదము సేయు ఖలుండు థాత్రిలోన్‌.

గద్య - ఇది శ్రీమద్విశ్వనాధ సదను కంపాసంపాదిత కవితావిచిత్రా

త్రేయ మునిసుత్రామగోత్ర పవిత్ర మధిర కులకలశ జలనిధి

రాకాకుముదమిత్ర కొండయార్యపుత్ర సుబ్బన్నదీక్షిత

కవి విరచితంబగు కాశీయాత్ర చరిత్రంబునందు

సప్తమభాగంబున జితవతీ చరిత్రము.

శ్రీ విశ్వనాధార్పణమస్తు.