పుట:కాశీమజిలీకథలు -07.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసిష్ఠుని కథ

79

నది. యా పాలంగ్రోలి ప్రభాకరుండు దివ్యప్రభాకరుండై జితవతింగూడి యభీష్ట కామంబులఁ దృప్తుండయ్యెను.

ఒకనాడుక్రీడాంతరంబునఁ బ్రభాకరుండామె మొగముజూచి నవ్వుచుబ్రేయసీ ! నాఁడు నీవు యోగినివై యున్నప్పుడు నీ చూపులు జూచితిని. కేవలము శాంతరస ప్రధానములై యున్నవి. ఇప్పుడిట్లు పచ్చ నిల్తుని పూముల్కులువలె హృదయభేదకము లగుచున్నవి. ఈ శృంగారవిలోకము లెప్పు డభ్యసించితివని పరిహాసమాడిన నవ్వుచు నాపువ్వుఁ భోణి ప్రభాకరుని సాన్ని థ్యంబు లభించినఁ గనుదమ్ములకుఁ గ్రొత్తయందము గలుగుట యబ్బురముకాదు. అని యుత్తరముజెప్పి యా పురుష సింహమును సంతోష సాగరమున నోలలాడించినది.

ప్రభాకరుండు జితవతింగూడి పెద్దకాలము ఇంద్రవైభవ మనుభవించుచు రాజ్యము గావించెను.

గీ. ధరఁగృతజ్ఞునికన్న నుత్తమ సుకృతి యు
    గనఁ గృతఘ్నునికన్న దుష్కకల్మషుండు
    లేడు లేడని శాస్త్రము ల్విప్పిచెప్పె
    సత్య మా మాట కిది నిదర్శనము కాదె

సీ. నితరణంబున జగద్విశ్రుతయశులైరి
             శిబి సూర్యసుత దధీచిప్రముఖులు
    సత్యంబె వ్రతముగాఁ జన హరిశ్చంద్రుడు
             త్రిభువనంబు లెఱుంగఁ దేజమందె
    సాహసంబె ప్రధాన సద్గుణంబై యొప్ప
             విక్రమార్కుఁడు దేవ వినుతుఁడయ్యె
    శమగుణై కాంచిత స్వాంతుఁడై భరతుండు
             మునుల కందరాని ముక్తివడసె

గీ. జితవతి కృతజ్ఞ తాగుణ వ్రతముబూని
    చిరతపఃపూత మునిజాత నిరతిశయన
    మస్తసురగీత విఖ్యాత మహిమగాంచె
    సుగుణమేదైన జనుఁ బరిశుద్దఁజేయ.

గోపా ! వినుమా ప్రభాసుండు శంతనునివలన గంగాగర్భంబునం జనించి భీష్ముండను పేరు వడసి సమస్త విద్యలం జదివి యస్త్రశస్త్రధారణంబునఁ అసమానుండై యొప్పుచు రెండవ జన్మంబునఁ బలడిత రాయలై యుదయించెను.