పుట:కాశీమజిలీకథలు -07.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వసిష్ఠుని కథ

77

గొడుకులగాఁగనినది. జాతమాత్రమున శాపవిముక్తులై యార్వురు వసులును నీభర్తకిచ్చిన దుష్టశాపముల గుఱించి పరితపించుచుండ నాకాశవాణి వసువులారా ! మీరు ప్రభాసుని నిమిత్త మించుకయు విచారింప నవసరములేదు. ఆతడు భీష్ముండను పేరుతోబుడమిఁ బెద్దకాలము బ్రతుకును. దేవతలకన్న నెక్కుడు విఖ్యాతి వడయఁగలడు. సర్వధర్మములు అతనికే తెలియును. స్వచ్చంద మరణుండై యుండునని పొగడుచు నెఱింగించినది. వసువు లింటికి వచ్చినీకీ వార్త దెలిపి రమ్మనిరి. అని చెప్పినవిని యోగసక్త యిట్లనియె.

అక్కా ! అతి కౄరమైన యతి శాపంబిట్లు మారుటకుఁ గారణమేమియో తెలిసినదియా? యని యడిగిన నామె యది యేమియో నాకుఁ దెలియదు. ఇది అసత్యము కాదు. యదార్థవచనమని పలికిన నవ్వుచు యోగసక్త అక్కా ! యిక్కార్యంబ౦తయు నీ కాంత వలన ఫలించినది. అందు వసుసామర్థ్య మేమియు లేదని జితవతి వృత్తాంత మంతయు నెఱింగించినది.

అప్పుడు తేజోవతి యేమీ? యీమెయే జితవతి. ఆహా ! నేఁడెంత సుదినము. అని పొగడుచు నామెం గౌఁగలించుఁ కొనుచు దల్లీ నీ వలన మా కులంబు నిలఁబడినది. మే మందరము నీ కృతజ్ఞతకుఁ దాసులమై యుండెదము. నిన్నుఁబోలిన పుణ్యాత్యురాలు లేదు. అని పొగడుచుండ జితవతి యామెకు నమస్కరింపుచుఁ జెవులు మూసికొనినది. యోగసక్తయుఁ దేజోవతియు జితవతికి బోధించి జటావల్క లాదులఁదీసి దివ్యమాల్యానులేపన మణిభూషాలంకృతం గావించి ముహుర్త మాత్రములో నామె మేడమీద దింపి రండని పరిచారకుల నియమించిరి.

అయ్యుప్పరిగపై నున్న పరిజనమా రాజపుత్రిక రాకజూచి జితవతి జితవతి యని కేకలువై చుచుఁ బదుగురకుం దెలియఁజేసిరి. సంభ్రమముతో రాజపత్నియు రోహిణియు మున్నగు అంతఃపుర కాంతలామేడకువచ్చి జితవతింజూచి కౌఁగలించుకొను చుండిరి. జితవతియు వారినెల్ల నాదరించచుఁ దల్లికన్న ముందు రోహిణిం గౌఁగలించుకొని ప్రియసఖీ ! ఇంటికెట్లు చేరితివి? ప్రవాహములోఁ గొట్టుకొనిపోయి ఎందుఁ గట్టెక్కితివి? ఆ పులియేమైనది. చెప్పుము. అని యడిగిన రోహిణి తనకథ యంతయు జెప్పినది. జితవతియు రోహిణి యడుగఁ దన వృత్తాంత మంతయు వారికెల్ల నెరింగించినది.

పిమ్మట మందిరాభ్యంతరమున కరిగి పరంపరలుగా వచ్చి చూచెడు బంధువుల కందఱకు అత్తెరంగెఱింగింపుచుండ వినోద నినాద మేదురంబై యాగృహంబు సాగరంబువోలె ఘూర్ణిల్లుచుండెను. ఉశీ నరుండరుదెంచి పుత్రికం గౌగలించుకొని యానందాశ్రువులచేఁ దదీయ శిరంబు దడుపుచుండఁ గులపాలికా విరుద్దంబగు చర్యలఁ