పుట:కాశీమజిలీకథలు -07.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోగసక్తకథ

5

తివి. ఇదియే మావృత్తాంతము. దేవీ ! యకారణ బంధురాలవై మాకుదర్శన మొసంగిన నీయుదంతమువిన మేము బాత్రులమేని శ్రోత్రానందము గావింపుమని వేడికొనుచున్నదాన నని పలికిన విని అక్కలికి లేనగవు మొగమున మొలకలెత్త నత్తన్వి కిట్లనియె.

యోగసక్తకథ

సఖీ ! వినుము దేవలోకములో వసువులని యొకజాతి వేల్పులు గలరు. వారెనమండ్రన్నదమ్ములు దేవసభాసామాజికులై విమానము లెక్కి స్వేచ్ఛావిహారంబులు సేయుచుందురు. మహేంద్రుఁడు గురువాక్యసమానముగా వారిమంత్రంబుల మన్నంచుచుండును. నేనువారిలో గడపటి వసువు ప్రభాసుని భార్యను. నా పేరు యోగసక్తయండ్రు. వినుము ఇక్ష్వాకకులసంభూతుఁడగు మహాభీషుండను నృపతి క్షితినపరిమితసహస్రాశ్వమేధములు గావించి స్వర్గలోకమున కరుదెంచి సకల దేవతా మునిపూజ్యుండై యొప్పుచుండెను.

అమ్మహాభిషుం డొకనాఁడు ఇంద్రాది బృందారక సందోహముతోఁగూడ బ్రహ్మసభకుఁబోయి కూర్చుండెను. సిద్ధవిద్యాధర గంధర్వ కింపురుషాది దేవాతా విశేషులును నారదాదిమహర్షులు దిక్పతులు నిండియున్న యక్కొల్వుకూటంబునకు గంగామహాదేవి దివ్యాంగనారూపముదాల్చి విచ్చేసినది. ఆమెవచ్చుచుండ గాలిచేఁ గట్టినపుట్ట మించుక తొలఁగినదట అందున్న సమాజికులెల్లఁ పాపభీతిచేఁ దలలు వంచికొనిరి. మహాభీషుండు తలవాల్పక కదళీకాండ గర్భంబునుంబోలి యారంభోరు నూరుభాగంబు సాభిలాషతో నీక్షించుటయు నాదుష్టచేష్టంగాంచి కాంచనగర్భుం డలుగుచు రాజా ! నీవు కడుపుణ్యాత్ముండవై యుత్తమలోకంబులం బడసియు మాయెదుటనే దూష్యకృత్యంబులం గావించితిరి. నీవిందుండఁదగవు. మనుష్య లోకంబున జనింపుమని శాపమిచ్చెను. అందులకు వగచుచున్న యన్న పపురంఢరుని చిత్తశాంతికై త్రివిష్టపంబుననెల్లి యమరవల్లభుం డొకసభ జేయుచున్నవాడఁట. వసువు లయ్యోలగంబున కాహూతులై యరుగుచు నీదివసంబున విభావసు వసువిసరములచే నాకసమంతయు దప్తమగుటయు నవ్వేడిమికొడి గగన గమనంబు మాని తమ విమానముల మానవలోక నికటభాగములకు దింపి శీతల శీకర తరంగ మాలికాడోలికల నూగునట్లు జలధిమీదుగా నడపింపదొడంగిరి. అప్పుడు కాలకళాదుండు బ్రహ్మాండహసంతికలో రవిబింబమును పైడికమ్మింగాంచి కడలియను నీతొట్టెలో ముంచెనోయన రవి యపరసాగరజలంబున మునింగెను. తత్తాపంబునకు జలంబు లుడికి త్రుళ్ళుచున్నవియో యన మకరాకరమున భీకరములగు శీకరములు వీచికా