పుట:కాశీమజిలీకథలు -07.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కాశీమజిలీకథలు - సప్తమభాగము

    గంధమాల్యాద్యలంకారంబు లర్పించి
             పూజించె వెసనొక్క పూవుఁబోణి
    పాదంబులొత్తె సద్భక్తి నొక్కవధూటి
             తాంబూలమిచ్చెఁ బైదలి యొకర్తు

గీ. జితవతీసతి గనుసన్న జేసినంత
    చెలులు సకలోపచారముల్ జేసిరట్టు
    లమర కాంతకు నంతరంగమునఁ జెలఁగి
    వారిభక్తికి నామె దీవనలొసంగ.

సింహాసనాసీనయైయున్న యన్ని లింపాగనయెదుర నంజలి పుటంబు శిరంబునంజేర్చి వినయంబు దీపింప జితవతియల్లన నిట్లనియె.

శా. దేవీ! నీవు సమస్తలోకముల రక్తిన్ బ్రోచు శర్వాణివో?
    శ్రీవో! పద్మజురాణివో! సురపతిస్త్రీవో! మరుత్కాంతవో
    దేవరాతి వధూటివో? పసుపురంధ్రీమౌళివో? కావలెన్
    భావింపన్భవదీయరూప విభవప్రాగల్భ్యముల్ దివ్యము
    ల్గావే! మామక పూర్వపుణ్య పరిపాక ప్రాప్తిచేఁగాక మా
    కీ వీరీతిఁ బ్రసన్న వౌదువె! కృపాదృష్టిన్ బ్రపాదింపుచున్
    బ్రోవంగాఁదగుదమ్మ మమ్మిఁకను బ్రాపుంజేర్చి సద్భక్తితోఁ
    గావింతుం గొనవమ్మ నీకిదె నమస్కారఁబు లోకేశ్వరీ.

అని అనేకవిధంబులం బొగడుటయు నవ్వేలుపుఁ జవరాలు తదుపాసన కెంతేని సంతసించి యమ్మించుఁబోణి కర్దాసనంబిడి యక్కునం జేర్చుకొని గారవించుచు నపారగౌరవంబేసారఁదరుణీమణీ! నీవుప్రాయంబునఁ గడుపిన్న వయ్యుఁ బ్రోఢవలె నాకపూర్వసత్కారములు గావించితివి. నీయుపచార పరిగ్రహంబు నాడెందము నీయందు నెలకొల్పఁ జేయుచున్నది. నీపేరెయ్యది? యెవ్వనికూఁతురువు? భర్తయెవ్వఁడు? ఇది యేపురము అని అడిగిన జితవతి కుతుకమతియై యిట్లనియె.

భగవతీ! నా పేరు జితవతియండ్రు. ఇది భోజనగరము. ఉశీనరుండను మహారాజీ పురము పాలించుచుండెను. నే నాఱేఁని పుత్రికను నాకింకను వివాహముకాలేదు. వీండ్రందఱు నా సఖురాండ్రు. వీండ్రు పరిచారికలు, వీరు చుట్టములు. మేమీఱేయి వెన్నెల సేవింపుచు నమృతకరు నారాదింపుచుండ నీ మండనము నాదోసిటంబడినది. దీని దేవతా ప్రసాదముగా స్వీకరించి ముఱియుచుండ నింతలో నీవు సాక్షాత్కరించి