పుట:కాశీమజిలీకథలు -07.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10]

వసిష్ఠుని కథ

73

తదీయ సుగుణవిశేషంబుల కంతకుముందు మెచ్చియున్నవాడు కావున మందహాసము గావింపుచు జితవతి శిరంబునఁ గరంబిడి లేవదీసి యూరడింపుచు నిట్లనియె.

పుత్రీ ! నీచారిత్రము కడు పవిత్రమైనది నీశీలము స్తుతిపాత్రమైనది. నీయభీష్ట మొకరీతి దీర్పఁగలను. వినుము వారికి మనుష్యజన్మము తప్పదు. అందు సర్వోత్కృష్టత గలుగు నట్లనుగ్రహించెద వినుము ప్రభాసుండు పుడమి దేవతాగర్భంబున నుత్తమక్షత్రియునివలన జనించును. అస్తశస్త్రములందుఁ దేజోబలపరాక్రమములయందు మూడులోకములలో నీడులేనివాఁడని వాడుక వడయును. విద్యలచే బృహస్పతిని మించగలఁడు మహర్షు లతనియొద్ద జ్ఞానము నేర్చుకొందురు అతనకిఁ దెలియనిధర్మంబు లుండవు. జితేంద్రియులలో మొదటి వాఁడగును. పరమభక్తా గేసరుడు, స్వచ్చందమ రణుఁడునై పెద్దకాలము పుడమి నలంకరించును. భార్యాపుత్ర శూన్యుండయ్యును బెక్కు బలగము గలవాఁడగును. వేయేల? అతనికి వసువుగా నున్నప్పటికంటె మనుష్యుఁడుగా నున్నప్పుడే యెక్కువఖ్యాతి రాగలదు వసువు లప్పుడప్పుడుపోయి యతనితో సంభాషించి వచ్చుచుందురు. నీనిమిత్తమై యిన్నివరంబు లతని కొసంగితిని. సంతసించితివా? అని పలికిన విని నమస్కరించుచు జితవతి యిట్లనియె.

తండ్రీ ! ప్రభాసు ననుగ్రహించితివి. యోగసక్తను గూడ నుత్తమజన్మగాఁ జేయవాయని వేడిన నతం డించుక యాలోచించి కానిమ్ము నీవుజెలఁగినఁజాలు నీసఖురాలు యవనపుత్రికయను వాడుక బడయుంగాని బ్రాహ్మణునికే జనించును విద్యలలో సరస్వతిని, రూపంబున రతిని, భాగ్యంబున లక్ష్మిని, ప్రభావంబున గౌరిని మించి కారణాంతరమున రెండవజన్మమెత్తి పండితరాయలను బిరుదము వహించిన ప్రభాసునే పెండ్లి యాడును. కోపంబు గలిమిచేఁ గొన్ని యిడుములం బడునుగాని యవి దీర్ఘములుగావు. చివరకు భార్యాభర్త లిరువురు గంగా గర్భంబునఁ బ్రవేశించి పూర్వరూపంబులం దాల్తురు వారికీవరంబులు చాలునా? జితవతీ ! అని అడిగిన నప్పడఁతి చేతులు జోడించుచు నిట్లనియె.

తండ్రీ ! ప్రభాసుండు పుడమిఁ బెద్దకాలము భార్యలేక సంచరించుంగదా? ఆతండు రెండవ జన్మమెత్తుదనుక యోగసక్త‌ యేమి చేయుచుండును. అనతీయుఁడని యడిగిన నవ్వుచు నతండిట్లనయె.

తనపతి రెండవజన్మమెత్తుగనుక యోగసక్త తనపేరు సార్థకము నొంద యోగనక్తయై తపంబు గావించు నట్లనుగ్రహించితి‌ నిఁక జాలునా యని పలికిన విని జితవతి ప్రహర్షసాగరంబున మునుంగుచు దండ్రీ! ఇంకొక్కటి మిమ్ము వేడఁదలంచితి నాగ్రహింపవలదు నా నిమిత్తమై మరణమునొందిన యీ పులి కుత్తమలోకము గల్గునట్లు వరమీయబ్రార్థింతు. ఇదియే నా కడపటికోరికయని నుడివిన నతండిట్లనియె.