పుట:కాశీమజిలీకథలు -07.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

కాశీమజిలీకథలు - సప్తమభాగము

పుత్రీ! నీ యట్టి పుణ్యాత్మురాలి కుపకారము గావించిన పులియూరకపోవునా? విను మది చక్రవర్తియై యుదయించును. క్రౌర్యస్వభావంబునంజేసి యవనుండగును. అతనికి యోగసక్త కూఁతురనువాడుక బడయునని యానతిచ్చెను..

పిమ్మట నా కొమ్మ రోహిణి సమసినదికా నిశ్చయించి దాని గురించియడుగఁ బోయి మోమాటపడి యూరకున్న గ్రహించి వశిష్టుఁడు బాలా ! నీ సఖురాలు రోహిణి యింటికిం బోయినది. సుఖంబున్నది. క్రమ్మర నీతో గలసికొనఁగలదని పలికెను.

అప్పుడు జితవతి మహాత్మా ! నీ దయవలన నా మిత్రులెల్లరు గృతార్దులైరి. మఱియొక విషయమడుగ మరచితిని. ఇప్పుడు రోహిణి బ్రతికి యింటికిం బోయినదని చెప్పితిరి. దాని నెక్కించుకొని యమునలో నీదికొనిపోయిన పులిమాట యడుగుట మరచితిని. అదియు నా కుపకారము చేసినదే దానికుత్తమగతు లడుగ మరచిన నేను గృతఘ్నురాలను కానా? నా వలన దానికేమి ప్రతిఫలము గలిగినది. స్త్రీ చాపల్యంబున నిట్ల డుగుచున్నదని తలంపక అదియును ముక్తినొందునట్ల ను గ్రహింపుము. ఇఁక మిమ్మేమియు నడుగనన నతండు చిరునగవు మొగమునకు భూషణముగాఁగ నిట్లనియె.

పుత్రీ ! నీవెన్ని వరము లడిగినను నాకు మురిపెమే కలుగుచున్నది. నీవు స్వార్థపరురాలవు కావు. నీ కృతజ్ఞత త్రిభువన విఖ్యాతమై యుండఁగలదు. రెండవ పులియు ఢిల్లీశ్వరునికి మంత్రియై యుదయింపఁగలదు. ఇప్పుడు నీవు పూర్ణముగా సంతసించితివా! అభీష్టము లన్నియుం దీరినవియా! ఇఁక నీవింటికి బొమ్ము సుఖింపుము. అని వక్కాణించిన విని యమ్మించుఁబోణి చేతులు ముకుళించి స్వామీ ! మీ యనుగ్రహంబున నేను మనుష్యాంగనలలో నుత్తమురాలనైతిని. ఇఁక నాకే కామితమును లేదు. మీ పుత్రికనై యిందు మీ పాదసేవ జేసికొనుచుఁ గాలము పుచ్చెద. మఱియు నే పుణ్యాత్మురాలి‌ మూలమున నాకు మీ దర్శనలాభము గలిగినదో యా యోగసక్త యొకసారి నా కన్నులం బడునట్లు చేయుఁడు. ఇక నాకు స్వర్గలోక సౌఖ్యమిచ్చనను నవసరము లేదని కోరుకొనియెను.

అమ్మహర్షి పుంగవుం డా మాటవిని యరుంధతి మొగము జూచెను. ఆ పతివ్రత జితవతిని బుజ్జగింపుచు బుత్రీ! నీ శీలమహిమచేఁ బుణ్యలోకంబు లన్నియు గుత్తగొంటివి. మఱియు సుఖోచితమైన ప్రాయంబునఁ బడరాని యిడుములం గుడిచితివి. నీ సౌందర్యమునకుఁ దగినట్టి వరుం బరిగ్రహించి గార్హస్థధర్మంబుల నడిపి పిమ్మట ముక్తవయ్యెదవుగాక ఇప్పుడింటికి బొమ్ము. తృటిలో నంపించెదమని పలికిన