పుట:కాశీమజిలీకథలు -07.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కాశీమజిలీకథలు - సప్తమభాగము

వినంబడినది? యోగసక్తా ! నాకతంబున మీకెట్టియిక్కట్టు వచ్చినది అని పలుకుచు నేలంబడి మూర్ఛిల్లినది.

ఆమునిబాలకుఁడు లేవనెత్తి తల్లీ ! వసువులు నీకు బంధువులాయేమి? వారి కొరకై పరితపించెదవేమిటికి? అని యడిగిన జితవతి కన్నీరు దుడిచికొనుచుఁ దన కథ అంతయుఁజెప్పి బాబూ ! వారి ముప్పునకు మూలము నేనైతిని తండ్రీ యోగసక్త నేమైన శపించెనా? యామె యేమైనది నాయనా ! చెప్పమనుటయు నాబాలుండు సాధ్వీవినుము మాగురుండు బతిని సతీసుతహీనునిగా శపించిన విని యడలుచు యోగసక్త తన్నుఁగూడ మనుష్యయోనిం బుట్టఁజేసి‌ అతనికి భార్యయగునట్లు చేయుమని కోరినది.

ఆయన అందుల కంగీకరింపలేదు అప్పు డప్పడఁతి చురచురం జూచుచుఁ గఠినమతీ! నీసతి నీకెట్లో యాయనకు నేనట్లుగానా? మీ వియోగమునకు మీభార్య పరితపింపదా? మమ్ము విడఁదీయుదువా? అని యేమేమో నోటికి వచ్చినట్లు మునివరుని నిందించినది.

ఆజడదారి పెద్దతటవోపిక జేసియుఁ గోపము నిలుపలేక దుర్మతీ? నీవు స్త్రీవని విడిచినందులకుఁ బిన్న పెద్ద దారతమ్యము విచారింపక ప్రేలుచుంటివి. ఈయపరాధమంతయు నీయం దేయున్నది. నిన్ను విడువరాదు. వినుము నీవు గోమాంసభక్షులైన మ్లేచ్ఛజాతింబుట్టి పెక్కు కష్టము లనుభవింపఁ గలదానవు పోపొమ్ము అని పలికి అమ్మునివరుం డవ్వలికిఁ బోయెను. ఆదంపతులు విచారగ్రస్త చిత్తులై ' యేమాటయుం బలుకక శాపఫలం బనుభవింప నరిగిరి.

పురాకృత మెట్టివారికి ననుభవింపక తీరదుగదాయని చెప్పిన విని యాచిన్నది గుండెపగుల నేడ్చుచు యోగసక్తా ! నాకతంబున కాదా నీవా మునిచేత దుర్మతీయని నిందింపఁబడితివి. ఇప్పుడేమి చేయుదును నీదురవస్థవినియుఁ బ్రతికియుంటిని? నేను కృతజ్ఞురాలనా? కాను కాను వేషమునకే అని పలవరింపుచుండ మునిబాలుండు వెరగు పడుకు‌ తల్లీ ! నీశీలము కొనియాడఁదగియున్నది. ఇప్పుడు మా అయ్యగారు భార్యతో వినోదముగా మాట్లాడుచున్నవారు నీవు వేగము పోయి వారిం బ్రార్థింపుము యేదేని సదుపాయము జేయఁగలరని బోధించి యా శిష్యుఁ డవ్వలికిఁ బోయెను.

జితవతియుఁ దదు పదిష్టమార్గంబునఁబోయి వసిష్ఠాశ్రమాంతరమున--

గీ. మడతగాఁజేసి వ్యాఘ్రచర్మంబు భక్తి
    దైవమునువోలెఁ దనదు మస్తకమునదాల్చి
    తడిఁబడఁగ మెల్ల మెల్లన నడుగులిడుచు
    వచ్చు జితవతిఁగాంచె దాపసవధూటి.