పుట:కాశీమజిలీకథలు -07.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నదియా? అని యడిగిన యోగి అగును. ఆ ముద్దుగుమ్మ నా యొద్దకు వచ్చినది. దాని చిత్తశుద్ది యరసి యది కోరినరీతి నతివేగముగా వశిష్ఠుని యాశ్రమమున కరుగునట్లు చేసితిని. మీ రెవ్వరని యడిగిన విని నే నాతురతజెంది యిట్లంటిని.

మహాత్మా ! నేనామె సఖురాలను. ఆమెతోగూడ నిల్లు వెడలితిని. కష్టముపడితిని. యమునలో విడిపోయితిమి. నన్నుఁ గూడ నందు జేర్పరా? అని మొర పెట్టుకొనిన నతండు చాలు జాలు మా కిదియే పనియా పోపొమ్ము. నీవందఱుగ నర్హురాలవు కావని పలికి యా తపసి స్నానమునకై యరిగెను.

అప్పుడు మేము దారి గాచుకొని యతండు మరల వచ్చుదనుక నందుండి పాదముల కడ్డముపడి నమస్కరింపుచు మునివర్యా ! ఆ చిన్నది యెన్నటికైన నింటికి వచ్చునా ? ఇది యొక్కటియే చెప్పుఁడు. ఇఁక మాదారి మేము పోయెదమని పలికిన నతం డించుక ధ్యానించి యింటికి రాకేమగును. పోపొండు అని పలికి వెండియు వృక్షారోహణము గావించెను. మేము సంతోషము జెందుచుఁ గ్రమ్మరఁ బ్రద్యో తన నగరమునకు వచ్చితిమి. అవ్వార్త మీకుఁ దెలుపుటకు దూతలవెంట వెంటనే యిందు బుచ్చితిని. ఇదియే నావృతాంతమని యాకథయంతయు రోహిణి వారి కెఱింగించెను.

అని యెఱింగించి మణిసిద్దుండు-ఇట్లని చెప్పఁదొడంగెను.

113 వ మజిలీ.

వసిష్ఠుని కథ

అహా ఆమహర్షి ప్రభావ మేమని కొనియాడఁదగినది? కన్నుల మూసికొని తెరచి చూచినంతలో నెంత సంతోషము గలుగఁజేసెను? అయ్యారే? యిది మేరు పార్శ్వ భూభాగమునందలి వసిష్ఠమహర్షి యాశ్రమము గావలయును. ఔరా? బహుయోజనదూరములో నున్న వనిష్ఠాశ్రమము రెప్పపాటులోఁ జేర్చిన యా సిద్ధతాపసుని తపః ప్రభావము అవాజ్మానసగోచరముగదా? తాపసులు లోకోద్దరణమునకై తపంబు గావింపుచుందురు. తపోధనప్రభావంబునంగాక యీ ప్రదేశము మనష్యులకుఁ జేర శక్యమా? ఇది దేవతాభూమివలెఁ గనంబడుచున్నది. బళిరే యిచ్చటి భూమియంతయు రత్నమయమైయున్నది వృక్షములు సువర్ణచ్ఛాయలచే విరాజిల్లుచున్నవి. జాతివైరములు లేక మృగములు దిరుగుచున్నవి. ఇది తప్పక వసిష్ఠాశ్రమమే నా కోరిక ఫలించు సూచనలు గనంబడుచున్నవి. అదిగో మునిబాలుఁ డెవ్వఁడో నాదెసకు వచ్చుచున్న వాఁడు. వానివలన నీదేశవృతాంత మడిగి తెలిసికొనియెదంగాకయని యొకనాఁడు ప్రాతఃకాలమున నొక వనములో నిలువంబడి జితవతి తలంచుచుండెను.