పుట:కాశీమజిలీకథలు -07.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కాశీమజిలీకథలు - సప్తమభాగము

సంకెళులు వైచి కారాగారంబునఁ బడవేసి కొన్నిదినము లందుంచి చివరకు మాఱేడు ఏలినవారి యొద్దకుఁ బంపిరి. ఇదియే జరిగిన కథ యని యెఱింగించెను.

రాజు -- ఇందుఁ బ్రద్యుమ్నయోగి యెవ్వడు?

ప్రద్యుమ్న -- దేవా! నేను అని యెదురు నిలువం బడియెను.

రాజు - నీవు ఆ యోగినుల బ్రహ్మానందు నొద్ద కనిపితివిగదా! అందులకు బాలసన్యాసులు నీకేమి లంచమిచ్చిరి?

ప్రద్యు -- దేవా! నాకు లంచముగా నీయలేదు జ్ఞానపత్రి నమిత్తమేదేని అప్పు డప్పు డిచ్చుచుందురు. అదియే వారు నాకిచ్చినది.

రాజు - పాపము! నీవు జేసినపని వారల కుపచరించినది కాదు కాబోలు.

ప్రద్యు - చిత్తము చిత్తము. నే నేమియుఁ జేయలేదు.

రాజు - కానిమ్ము. చిదానంద రమానందు లెవ్వరు?

చిదా - రమా - మేము దేవా! మేము అని ముందరకు వచ్చిరి.

రాజు - మీరా యోగినుల నెందుఁ జూచిరి?

రమా - ప్రయాగములో గంగాస్నానము జేయుచుండఁ జూచితిమి.

రాజు - వారికై యెంతసొమ్ము వ్యయపరచితిరి.

రమా - దేవా! దాచనేల వేయిమాడలు వ్యయమైనవి. యా మఠములో మా వలన లంచము తిననివాఁడులేడు. మఠాధిపతికిఁ బదిమాడల నొసంగితిమి దేవా!

రాజు - పిమ్మట నా బాలయోగిను లేమైరో వెదకితిరా?

రమా - లేదు దేవా! తరువాత బద్దులమై చెరసాల నుంపఁబడితి మెట్లుపోయిరో తెలియదు.

అని యీ రీతి నా నృపాలుండు సన్యాసు లందరివలన సాక్ష్యము పుచ్చుకొని తన్మూలమున రోహిణీ జితవతుల మనశ్శుద్ధియు సన్యాసుల క్రౌర్యములు దెల్లముగాగ వాండ్రనెల్లఁ గలయ గనుంగొని యిట్లనియె.

ఓ దురాత్ములారా? మీరు సన్యాసులమని పేరు పెట్టికొని మఠంబునం గూర్చుండి శాల్యన్నంబులం భుజించి మత్తి ల్లి యధమకృత్యములు జేయఁ దొడంగిరి మీ రధోగతి పాలగుటయేకాక యా జాతికిఁ గూడఁ గళంకము దెచ్చితిరి. మీ మేనులు తునకలుజేసి యుప్పుపాతర వేయించినను నిష్కృతి గలుగదు. మీకుఁ దగినశిక్ష యేది వేయుటకుం దోచకున్నది. ముందు విచారించెదనని పలుకుచు రాజభటుల వెంట వాండ్రనెల్లఁ జెరసాల కనిపి తాను విచారగ్రస్త మానసుండై యంతఃపురమున కరిగి భార్యతో నా వృత్తాంతమంతయు నెరింగింపు చుండెను.