పుట:కాశీమజిలీకథలు -07.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9]

సన్యాసుల కథ

65

అమ్మా ! ప్రయాగమునుండి సన్యాసులు కొందఱు సంకెళులు వేయఁబడి తీసికొని రాఁబడిరి. వారేమి నేరము జేసిరో తెలియదుకాని అమ్మాయిగారును రోహిణియు నా దేశములో దిరుగుచున్నట్లు వారివలన నొక ప్రతీతి బయలు వెడలినది. ప్రయాగాధి పతి అయ్యగారి కేదియో జాబువ్రాసి పంపిరి. ఆ పత్రికం జదివికొనినతోడనే మీకీ వార్త జెప్పిరమ్మనిరి. ఇంతకన్న నాకేమియుం దెలియదని యా కింకరుఁడెఱింగించెను.

అప్పుడు రాజపత్ని తిలకా! నీవు సభకుఁ బోయి సన్యాసు లేమి జెప్పెదరో విని నాకు వచ్చి జెప్పుము. పొమ్మని యాజ్ఞాపించుటయు నా తిలక వానివెంట నోలగంబునకుఁ బోయినది. అప్పు డుశీనర నరపతి సన్యాసుల విచారింవుచున్నవాఁడు.

రాజు - నీ వెవ్వఁడవు?

మఠాధిపతి - ప్రయాగములోనున్న మాధవ మఠమునకు ధర్మకర్తను.

రాజు - మాధవ మఠములో సన్యాసు లెందఱుందురు?

మఠాధిపతి - వేయిమందికి తక్కువ యుండరు.

రాజు - వాండ్రకు భోజనమెట్లు.

మఠా - ఆ మఠమునకు రాజదత్తములైన యగ్రహారములు పెక్కుగలవు. తదాదాయమువలన సన్యాసులకు జీవనోపాధి జరుగును. ఆరునెలలు దేశాటనము చేసి వచ్చినవాఁ డారునెలలందు గూర్చుండి కుడువ వచ్చును.

రాజు - మీ కలహము లేమిటికి వచ్చినవి ?

మఠా -- దేవా ! కొందఱు దుర్మతులు మఠములోఁ జేరుటచే మాకును మఠమునకుఁ గూడఁ జాల అపకీర్తివచ్చినది. వినుండు. కడచిన శివరాత్రికి నిరువురు బాల యోగినులు త్రివేణిలో స్నానము చేయుచుండ చిదానంద రమానందులు మోహించి వసిష్ఠాశ్రమమున కరుగుచున్న వారి సంకల్పము దెలిసికొని ఈ బడుగువానిచే వసిష్ఠ వేషము వేయించి ఈ బ్రహ్మానందుని మూలమున జంపకారణ్యమునకుఁ దీసికొనిపోయి యా యోగినులకు వీడే వసిష్ఠుఁడని చూపిరట. “ఆ బాల యోగినులు వీరి కపటము దెలిసికొని యెందో పారిపోయిరఁట.” అందుండి యీ యోగులిద్దరు తిరుగ మఠమునకు వచ్చుటయు వారినెల్ల వెదకి కొనుచు వీరిద్దరు మఠములో దగవుబెట్టి యిచ్చిన లంచము తమకిమ్మని పోట్లాడిరి. వాండ్రిచ్చిరికారు. దానకోపించి ఈ రమానందుఁడు దుడ్డుకఱ్ఱతో ముసలివాని నెత్తిమీదఁ గొట్టెను. బ్రహ్మానందుఁ డడ్డమురా వానిం గొట్టి నేలఁబడవేసెను. వృద్ధయోగు లిద్దరు బడినతోడనే అందున్న సన్యాసులు కొందఱు వారి వక్షముజేరి రమానంద చిదానందులఁ జావమోదిరి. అప్పుడందున్న సన్యాసులెల్ల రెండు పక్షములై పెద్ద యద్ధము గావించిరి. రాజభటులువచ్చి అందఱిం బట్టుకొని