పుట:కాశీమజిలీకథలు -07.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కాశీమజిలీకథలు - సప్తమభాగము

గృహస్తునింట బండుకొంటిని. దొంగలా రేయి వారిల్లు కొల్ల బెట్టినమాట వాస్తవము ఆ నేరము నాయందు మోపి రాజభటులు నన్ను మీ యొద్దకుఁ దీసికొనివచ్చిరి. అదియే నావృత్తాంతము అని యెఱింగించిన విని యా రాజపుత్రుఁడు ముక్కు పై వ్రేలిడుకొని పెద్దతడ వట్టె నిలువంబడి ధ్యానించచు నౌరా? యెట్టిచిత్రము వింటిని. ఆ యోగిని జితవతియా? చిత్రఫలకము చూచి యుండుటంబట్టి యామె రూపమెప్పుడో కాంచినట్లే యున్నది. భళిరే? యెంత చోద్యము? బాపురే? యెంత యాశ్చర్యము? అట్టి కృతజ్ఞురాలికి దైవము తోడుపడకుండునా? క్రూరమృగము లూడిగములు జేయుట యబ్బురమా? అని యూరక వెరగుపడుచు నయ్యయో ? అంతఃపురముల మెలంగెడిమీరెక్కడ? వసిష్ఠమహర్షి యాశ్రమ మెక్కడ? జితవతికి వెఱ్ఱియెత్తిన నీవు వలదనక పెద్దవారలకుఁ జెప్పక యట్లు చేయుదువా? ఆమెంగానక తల్లిదండ్రు లెంత చింతించుచుందురో? కానిమ్ము గతంబునకు వగచినం బ్రయోజనములేదు. ఇప్పుడామె యుత్తర దిశనున్న అరణ్య మార్గమునఁ బోయినదని జాడలు దెలిసినవి మనము పోయి పట్టుకొని కట్టి పెట్టి బలవంతమున నామె నింటికిం దీసికొని పోవుదము. జితవతియని తెలిసిన నేనప్పుడే చేయిపట్టుకొని యాటంకము చేయకపోవుదునా? అని చెప్పి అతండు తండ్రి కా తెరం గెఱిగించి యుచిత పరివారముతోఁ గూడికొని రోపాణి వెంటబెట్టుకొని యుత్తర దేశారణ్యములు తిరుగుచు నామెను వెదకుచుండెను.

అని యెఱింగించి మణిసిద్దుండు - ఇట్లని జెప్పందొడంగెను.

112 వ మజిలీ.

సన్యాసుల కథ

అమ్మా! లెమ్ము లెమ్ము. ఎన్ని దినము లిట్లాహారము గుడువక కృశించెదవు? జితివతి రోహిణియుఁ బ్రయాగమున కవ్వల అడవులలో దిరుగుచున్నట్లు జాడలు తెలిసినవట. ప్రయాగ నగరాధీశ్వరుండు కొందఱ సన్యాసుల మన రాజధానికిఁ బంపెను. వారి అభియోగము విచారించుచు అయ్యగారు మీకీవార్త దెలుపుమని పరిచరునిఁ బంపిరి. అనుటయు జితవతితల్లి అట్లే లేచి యేమీ! నాపట్టి బ్రతికి యున్నట్లు వార్తలు వచ్చినవియా? అయ్యయ్యో ? అరణ్యములలో దిరుగుట కేమి కారణము? ఎవ్వరు చెప్పిరి? ఏమని చెప్పిరి? అని అడిగినఁ దిలక యను పెద్దదాసి అమ్మా ! పరిచరుఁ డీమాట చెప్పెను. అతఁడు ద్వారమున నున్నవాఁడు రప్పింపనా? అనుటయు నామె వాని రాక కనుజ్ఞ యిచ్చినది. తిలక పోయి వానిం దీసికొనివచ్చి అమ్మగారితో సవిస్తరముగాఁ జెప్పుమని నియోగించిన నాకింకరుం డిట్లనియె.