పుట:కాశీమజిలీకథలు -07.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దపులుల కథ

63

పిమ్మట మేము లేచి నడువఁ దొడంగిన నవియు మా ముందర నడచుచుండు నవి నిలఁబడిన నిలువఁబడును. తావులేనిచో లతాగుల్మాదుల ఖండించి దారిజేయునవి. మృత్యుతుల్యములగు నాసత్వములు భృత్యకృత్యములు గావింపుచుండఁ బశ్చిమ ముఖముగా గొంతదూరము పోయితిమి. అ౦దొక నది మా కడ్డమైనది. ఇంద్రనీల ప్రభాధగద్దగితములగు నదీజలంబులు గన్నుల పండువు గావింప నది యమున యని తెలిసికొని తత్పవిత్రోదకంబుల స్నానము గావింపుచుండఁ బులులును మా ప్రక్కనే క్రుంకులు పెట్టుచుండెను. ఆ వినోదము జూచుచు మేము గొంతసేపు వానితో గూడ జలక్రీడ లాడితిమి. అట్టితఱి చిన్న మబ్బుబట్టి వామనదేహమట్లు క్రమంబున విస్తరిల్లి యింద్రజాల ధూమమువలె విజృంభించి దెసల జీమట్లుక్రమ్మ మొగులు మూసికొని పెద్ద వర్షము గురియఁ దొడంగినది.

మ. కరకాచ్ఛాదితమై ఘనాఘనబృహద్గర్దాకవో పేతమై
     వరవిద్యుల్లవతి ప్రబలమై వాస్తోష్పతిష్యాన---
    ధురిమై సర్వదిశాభిభాగములు నస్తోకాంబుపూర్ణంబుగా
    గురిసెవ్వర్షము నీడజవ్రజము సంక్షోభింప భీమంబునన్.

ఆ వృష్టిపాతకంబునకు వెరచుచుఁ గంఠదఘ్న జలంబున నిలిచి వృధుధారాతా నంబున శిరోవేదన జనియింప జలంబుల మునుగుచుఁ దేలుచుఁ గొంతసేపెట్లో యా సంకటము సైరించితిమి. క్రమంబున నవ్వర్షో ప్రదవంబు బ్రళయకాలంబో యన వెరపుగలుగఁజేయ దొడంగినది.

అంతలో నా ప్రవాహమునకుఁ గ్రొత్తనీరు దగిలి పొంగుట ప్రారంభించినది. మా పాదములు తేలిపోయినవి. నీటిలో మునుగుటకు సిద్ధపడితిమి. అప్పుడు దాపున నున్న పులులఁ జెరియొక దానిం బట్టికొంటిమి. అవియు విన్నాణముగా మమ్ముఁదమపై కెక్కించుకొని యోడలవలె నా ప్రవాహములో నీద మొదలు పెట్టినవి. కొండంత యెత్తునఁ బొంగి యా ప్రవాహము శరవేగముగాఁ బారుచుండెను. తీరభూరుహములు వ్రేళ్ళతోఁగూడ గుభాలుమను చప్పుళ్ళతో నేటిలోఁ బడి కొట్టుకొని పోవుచుండెను.

మమ్మా పెద్దపులులు వీపుపై నాపికొని ప్రమాదము రాకుండ నీది యీది యవ్వలిదరి జేరవలయునని ప్రయత్నించినవి. శక్యమైనదికాదు. రెండుపులులు విడి పోయినవి. నేనెక్కిన పులి బలహీనమై కాళ్లుతేలవైచి‌ నీరుమ్రింగి కొంత సేపటికిఁ బ్రాణములు విడిచినది. నేను దాని కళేబరము విడువక యొక కర్రతోఁ జేర్చి పట్టుకొని యా రాత్రి యెల్ల గొట్టుకొని పోయితిని. తెల్లవారుజామున నీ పల్లె వాండ్రు వచ్చి నన్నుఁ దెప్పలపై కెక్కించుకొని తీరము జేర్చిరి ఆనాఁడు రాత్రి యా పల్లెలో నొక