పుట:కాశీమజిలీకథలు -07.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మతిక్రూరము ఇంకను జిక్కులు పడవలసిన యోగమున్నది. అందుకై మనల పెద్దపులుల కాహారము సేయుఁడయ్యె. ఇఁక మనము బ్రతికిన ప్రయోజనములేదు. పులుల వెదకికొనుచుఁ బోవుదము. నోఁటిలోఁ దలపెట్టినను మ్రింగవాయేమి? పదపద. మనకు దారిజేసినవని పలికిన విని నేనును తత్కాలోచితమైన మాటలచే నాబోటికిఁ బ్రత్యుత్తర మిచ్చితిని.

అప్పు డిద్దరము లేచి తెరపిచేయఁబడిన తెరవున మెల్లగా నడువఁ దొడంగితిమి. కొంతదూరము నడిచినంత నా క్రూరమృగముల ధ్వనులు మా చెవులఁ బడినవి. అప్పుడు నేను భయకంపితిగాత్రినై గద్గస్వరముతో జితవతీ ? అవిగో రాత్రి పులులు మనదెసకు వచ్చుచున్నవి. ఇప్పుడు విడువవు. చంపగలవు. అయ్యో, అయ్యో, అని వగచుచుండ వారించుచు, జితవతి నవ్వుచు, రోహిణి? నీకాభయ మేమిటికి? క్షణకాల మోర్చితిమేని నీ యిక్కట్టు లన్నియుం బాయునుగదా. ఆడంబోయిన తీర్దమెదురైనట్లు మన మా పులుల కొరకు వెదకుచుఁ బోవుచుండ నవి యెదురైనవి. సంతసము జెందక దుఃఖించెద వేమిటికి? అని బోధించుచు నాచేయిపట్టుకొని వానికెదురుగాఁ దీసికొనిపోయినది.

క్రమంబున నా పులులు రెండును మా దాపునకు వచ్చి వచ్చి మచ్చికజేసిన వానివలెఁ తోకలాడించుచు మా పాదములు నాకదొడంగినవి. అప్పు డామగువ మృగరాజనులారా ! మమ్ము భక్షించి మీ యాకలి యడంచుకొనుడు అని పలికి కన్నులు మూసికొన్నది.

అ మ్మెకంబులు పెంపుడు కుక్కలవలెఁ బ్రక్క నిలువంబడి తోకలాడించుచు నడుగులు నాకుచుఁ జేతులు మూర్కొనుచు మమ్మాశ్రయించు సూచన లబినయించినవి అప్పు డబ్బురపాటుతో నాబోఁటి‌ యిదియేమి వింత? పులులు శాంతమూర్తులైన వేమి? ఇవి మరియొక జంతువులు కావుగదా యని యడిగిన నే నిట్లంటి.

సఖీ ! తెలిసినది. పులులు నీ శీలమునకు మెచ్చి యిట్లు వశమైనవి. మహర్షుల యాశ్రమముల మృగములు జాతి వైరములు విడుచునని మనము వినియుండలేదా. నీవు బాషితుల్యవైతివి. ఇఁక మృత్యువు నిన్నేమియుం జేయఁజాలదు. నీ సహవాసమున నేనును కృతకృత్యనైతిని. ఇఁక నీ మనోరథము సఫలము గాఁగలదు.

అని పొగడిన వినిపించుకొనక జితవతి పులుల వీపుపైఁ జేయివైచి ఱాచుచు జూలు దువ్వుచు ముద్దుపెట్టుకొనుచు మృగములారా? వీండ్రు కృతఘ్నురాండ్రని మా మేనిమాంస మేమాగించితిరా? అగునను కృతఘ్నుని మాంసము కుక్కయు ముట్టదండ్రుఁ మీ మాట జెప్పనేల యని యేమేమో పలుకుచుండ నవి పిల్లి కూనలవలె నణఁగి మా యడుగులమ్రోలఁ బండుకొన్నవి.