పుట:కాశీమజిలీకథలు -07.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కాశీమజిలీకథలు - సప్తమభాగము

తిని. కొంచెము విశ్రాంతిగలిగినతోడనే లేవదీసి చేయిపట్టుకొని మఱికొంతదూరము నడిపించితిని. పోయినకొలది యరణ్యము మూసికొనిపోయి దారి కనంబడలేదు అబ్బా ఆమహారణ్యము తలంచికొనిన నిప్పుడు మేను ఝల్లుమనుచున్నది. యెండయేమియు గనబడదు. చలిబాధ చెప్పనలవిగాదు ఎటుపోవుటకు దారిదోపక యొకచెట్టుక్రిందఁ జతికిలబడి నేనామెం గౌఁగలించుకొని యధైర్యముదోపఁ సఖీ ! మన చారిత్ర మింతటితో ముగిసినది. నీసుగుణపుంజములన్నియు నీయరణ్యము పాలైనవి. ప్రొద్దు గ్రుంక వచ్చినది. అక్కటా ! చక్రవర్తి కడుపునఁబుట్టి సకలవిద్యలంజదివి రూపమున పేరు పొంది ఇంద్రభోగము లనుభవించెడు నీకీ యడవినడుమ జావు విధింపఁబడినది. ఆహా ! విధి యెత్తికోల.

సీ. ధర్మమా! నీకేది ? తావలంబిటమీఁద
              శీలమా? నీవెందుఁ జేరెదింక
    శాంతి? నీవెందు విశ్రాంతి గైకొందువో
              సత్యమా? నీకు నిశాంతమేది?
    కనికరంబా? యెందుఁజని వసించెదవీవు
              త్యాగమా? యెందుఁ బోఁదలఁచినావు
    వైరాగ్యమా? యేదిదారి నీకిటుపైన
              శౌచమా? యెటఁ దల దాచుకొందుఁ

గీ. వహాహ మీకెల్ల నాటపట్లైన కొమ్మ
   యార్యగుణములబ్రోగు సౌందర్యరాశి
   జితవతీ సతియైహికస్థితులవదలిఁ
   యఱుగుచున్నది పరలోక మరయుఁ డింక.

అని నేను దుఃఖించుచుండ నామె లేచి నాకన్నీరు దుడుచుచు సఖీ ! నాకతంబున నీకీ వెత గలిగినది. నీవు సకలసుఖముల బంధువుల విడచి నాతోవచ్చి కష్టముల పాలైతివి. జన్మజన్మమునకు నీకు దాసురాలనై యుండునట్లు భగవంతునిఁ బ్రార్థించెద నింతకన్న నీకేమి యుపకారము చెప్పగలను. చావు వచ్చునని నాకేమియు వెరపు లేదు. కాని నీనిమిత్తమై వగచుచుంటిని. మనపురాకృత సుకృత మిట్లుండ మనకు మంచి యెట్లు జరుగును. పోనిమ్ము భోగములు అస్థిరములని మనము చదివితిమి గదా ? యెప్పుడో వానికంతమున్నది. మనకు మొదటనే వచ్చినవి గావున భగవంతుని ధ్యానము చేసికొందము. విచారింపకుము అని నాకు బోధించుచు చేతులుజోడించి కన్నులు మూసికొని -