పుట:కాశీమజిలీకథలు -07.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దపులుల కథ

59

యోగినీవేషము వైచినది. పురమువిడిచి మేము ప్రయాణములోఁ గొన్నిదినము లాయన వృత్తాంతము విమర్శించుచు వసించితిమి. కొందఱు యోగులు మమ్ము మాయ జేసి వసిష్టుండు చంపకారణ్యములో నున్నవాఁడు తీసికొనిపోయెదమని చెప్పి యొక యరణ్యములోనికిం దీసికొనిపోయిరి. అందు వారి కపటము దెలిసికొని యొకనాఁడు వారికిఁ దెలియకుండ నుత్తరముగా నడవులం బడిపోయితిమి.

అమ్మహారణ్యమధ్యంబున నడుచుచు జితవతి, ఔరా ! బైరాగులు యోగులు ఇంత కపటాత్ములని యెఱుఁగక పోయితిని. అయ్యో ! ఆబ్రహ్మానందయోగి యెట్టి శ్లోకములు చదివెను? ఎటువంటి యుపన్యాసమిచ్చెను. అఖండబ్రహ్మవేత్తవలె నభినయించుచుఁ నెట్టి నీచవృత్తి కవలంబించెను. సీ. సీ. బూడిదబూసికొని తిరిగెడు మన రూపువలచి యెంతకల్పనలు జేసిరి. చాలుఁ జాలుఁ మనపయనము చక్కఁగనే యున్నది. అక్కటా? మంచుబారిన యీ యిసుకనేల నడుచుటఁ గష్టముగా నున్నది. కాళ్ళు జివ్వుమనుచున్నవి. ఎట్లు నడుతును? మఱి యొకదారి జూపుమని పలికినఁ గన్నీరుగార్చుచు నే నిట్లంటిని.

తల్లీ ! నీదురవస్థం జూచుచుండ నాగుండె పగిలిపోవుచున్నది. నిన్నేమని యూరడింతును. అపాపాత్ములు ఎదురుపడుదురేమోయని మారుత్రోవం దీసికొని వచ్చితిని. ఈదారి మహారణ్యములోఁ బ్రవేశ పెట్టినది. ముందుదారి దోపకున్నదిగదా మఱియును--

సీ. రమణీయమణి కుట్టిమముల నల్లన చరిం
                 పఁగనె కందుఁ ద్వదంఘ్రి పల్లవములు
    పండువెన్నెలలు పైపై సోకినంతనే
                 వడ దాకుచుండు నీయొడలినిగ్గు
    అనురక్తిఁ బూలుగోసినమాత్ర శ్రమజలం
                మ్ములు గ్రమ్మ వాడు నీముద్దుమోము
    ఉపవనాంచితపతం గోచ్చ స్వనంబులా
                లించిన నీమది సంచలించు

గీ. నట్టి నీవిప్పుడీ కంటె కాటవులను
    దిఱుగుచుంటి వయో? తల్లి దిక్కుమాలి
    కటకటా! విధి యెటువంటి కఠినమతియొ
    నీగృతజ్ఞ మెచ్చి మన్నింపఁడయ్యె.

అని వగచుచు నే నామెను గొంతసేపందుఁ గూర్చుండఁబెట్టి పాదంబులొత్తి