పుట:కాశీమజిలీకథలు -07.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

కాశీమజిలీకథలు - సప్తమభాగము

టియే ఇరువురు పెద్దపులులతో యమునానదిం గొట్టికొని వచ్చిరి. వీరయం దెద్దియో యమానుష ప్రభావమున్నది. ఈమె నడిగి తెలిసికొనియెదంగాక సభ ముగించి యరుగఁడని చెప్పటయు నతం డట్టుకావించెను.

తరువాతఁ బ్రభాకరు డా యోగినికి నమస్కరింపుచు దేవీ ! నీ విధం బెఱుఁగక మా కింకరులు నీ కపచారము గావించిరి. మా తప్పు సైరింపవలయును. మఱియు నీ వలెనే పెద్దపులితో మొన్ననొక యోగిని యమునలోఁ గొట్టికొనివచ్చి కొన్ని దినములు మాయార నున్నది. పాప మాపులి సమసినది. విచారించుచు నమ్మించుఁబోణి మొన్ననే యెక్కడికో పోయినది. ఆ యోగిని వృత్తాంతము నీ వెఱింగియుందువు. మీ రెందలి వారలు. తొలిప్రాయములో నిట్టి వైరాగ్య ప్రవృత్తి వహించుటకుఁ గతంబేమి? మీ వృత్తాంత మెఱింగించి మమ్ము గృతార్ధులఁగావింపుము.

నాఁడు గట్టెక్కినతోడనే జితవతీ ! అని పిలిచితివఁట ఆ జితవతి యెవ్వతె ? నీ కెట్టి సఖురాలు? నేను బ్రభాకరుఁ డనువాఁడ ప్రద్యోతనుఁడను నరవరుండు నాకుఁ దండ్రి. మేమీ దేశాధిపతులము ఇదియే మా వృత్తాంతము ఇఁక నీ కథ యెఱింగింపక తీరదని మిక్కిలి వినయముతోఁ బ్రార్దించుటయు నా యోగిని మోమించుక యెత్తి యతని వంక జూచుచు నిట్లనియె.

రాజపుత్రా ! నా చరిత్రము కడువిచిత్రమైనది పిమ్మట నెఱింగించెద మీ యూరు వచ్చిన యోగిని యెన్నియేండ్లది? ఎట్లున్నది? ఎన్నెదినములు లిందున్నది? ఎందుబోయినది? పులితోవచ్చి గట్టెక్కినదా? అని యడిగిన నామె కాతఁడా యోగిని వృత్తాంతమంతయు వెండియు సవిస్తరముగా నెఱింగించెను.

ఆకథవిని యాయోగిని జితవతి కా నిశ్చయించి ఆహా ! ఈ ప్రభాకరునికే నాసఖురాలి నిచ్చుటకు నిశ్చయించిరి. మే మిక్కడికే రావలయునా? ఆమె యోగినీత్వమునకు శంకించుచు నితండు దరువాత బెండ్లి యాడుమనిన నాక్షేపించునేమో ఔరా! దైవమహిమ కానిమ్ము వీనికి మావృత్తాంత మెఱిగించి వీని సహాయమున నాసఖురాలిని వెదకి తెప్పించి యింటికిఁబోవు యత్నము గావించెదనని నిశ్చయించి రాజ నందనా ! మమ్ము నీవెఱుంగకున్నను నిన్ను మేమెఱుంగుదుము. మాయుదంతంబు మిక్కిలి హాస్యాస్పదముగా నున్నది. నీకంతయు నెఱింగించెద నాక్షేపింపక కర్తవ్య ముపదేశింపుము.

మీరిదివరకుఁజూచిన యోగినియే జితవతి. యుశీనరునికూతురు నే నామె సఖురాలను నాపేరు రోహిణియండ్రు. ఆమెకు యోగసక్తయను వసుపత్నితో మైత్రి గలిసినది. తననిమిత్తమై వసువులు శప్తులైరని విని వసిష్ఠాశ్రమమునకుఁ బోవుటకై