పుట:కాశీమజిలీకథలు -07.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8]

పెద్దపులుల కథ

57

జేసి యోగినీ వేషము వైచుకొని రాత్రికి రాత్రి యమునానది నీదికొని మత్స్యపురి జేరినదఁట. సాక్షులు విచారించి దీనికిఁ దగినశిక్ష విధింపవలయును. అని దండనాధుఁడు నివేదించుటయు రాజు ఇందుకు యాలోచించి సాక్షు లెవ్వరని అడిగెను.

మత్స్యముఖుడు జాలహస్తుడు అనువారల నెదర నిలువంబెట్టి వీరే ముఖ్య సాక్షులు. అని దండనాధుఁడు చెప్పినంత రాజు జాలహస్తు నవ్వలికిం బొమ్మని మత్స్యముఖునిం జూచి నీవేమిదూచితివో చెవ్పుమని యడగిన వాఁడు మ్రొక్కుచు నిట్లనియె.

స్వామీ ! ఏటికి వరద వచ్చినదని విని యొకనాఁడు తెల్లవారుజామున నేనును జాలహస్తుండును దెప్పలెత్తుకొని యమునకు బోయితిమి. మిన్నంటఁ బొంగిన యా నదిలో నప్పుడు మ్రాకులు మ్రాకులు కొట్టుకొని పోవుచుండెను మే మొక దారువుం జూచి మంచిదని యెంచి దెప్పలు వాలిచి యిరువురము నీదికొనిపోయి దానిం బట్టికొంటిమి. అదికర్రగాదు చచ్చినపులి ఆ పులిపై నీమె పండుకొని యున్నది. మొదట జడిసి పులి చచ్చినదని తెలిసికొని యీమెను మెల్లన మా తెప్పలపై నెక్కించుకొని యొడ్డు జేర్చితిమి.

ఒడ్డున నిలువంబడి యీమె కన్నులం దెరచి నలుమూలలు చూచుచు జితవతీ ! జితవేతీ ! సఖీ ! జితవతీ ! యన యెవ్వరినో పిలిచినది. ఎవ్వరుం బలుకలేదు. మీ రెవ్వరని మే మడిగిన మా కేమియు సమాధానము జెప్పక చేతులతో నేదియో సంజ్ఞ జేసినది. మా కేమియుం దెలిసినదికాదు. ఆమెను గట్టెక్కించి యూరి దారిజూపి మే మీతకుం బోయితిమి. మరునాఁడు రాజభటులు మా యింటికివచ్చి మమ్ముం బట్టికొని యేమేమో చెప్పుమని మాకు బోధించిరి. కాని యా మాటలేమియు జ్ఞాపకములేవు. ఇదియే నే నెఱింగినకథ యని మత్స్యముఖుఁడు. చెప్పెను. జాలహస్తునడుగ నా మాటలే చెప్పెను.

అప్పుడు దండనాధుఁడు దేవా ! వీండ్రు దీనివలన లంచములు దిని తిరిగి పోయిరి. మరికొందఱు సాక్షులు గలరు. గడువిచ్చునఁ దీసికొని వత్తుమని పలుకుచుండ నదలింపుచు చాలు చాలు మీ కల్పనలు దెలిసినవి. సాధుజనులపై నసత్యములు పలికినఁ బుత్రమిత్ర కళత్రాదులతో నశింతురుసుమీ? ఈమె కాదు మీరు శిక్షార్హులు పిమ్మట మీ పని విమర్శింతుము. పొండు పొండు అని రాజు వారిని మందలించి కుమారుని వంక జూచెను.

ప్రభాకరుఁడు తండ్రితో జనాంతికముగా నీ యోగినికి మొన్నవచ్చిన యోగినికి నెద్దియో సంబంధమున్నది. రూపభేదమున్నను నిరువురు గట్టిన పుట్టము లొక్కి