పుట:కాశీమజిలీకథలు -07.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

కాశీమజిలీకథలు - సప్తమభాగము

ఆవింతయంతయు దాపుననుండి కన్నులార జూచుచుఁ బ్రభాకరుఁడు దేవీ ! నీవింక విచారింపకుము. దీనికిఁ దగిన యాహారము పెట్టించెదను. ఎవ్వరు దీనిజోలికి రాకుండఁ జేసెదను. నీవూరడిల్లుము. దీని కొరకు నీవు గంటఁ దడిపెట్టుట ధర్మమా? సర్వసంగములు విడిచితివి. ఆశ్రితవత్సలతగాని నీకిది మమత్వముగాదు. నేఁబోయి వచ్చెద ననుజ్ఞ యిమ్ము అని పలుకుచు నతండఁటఁ గదలెను.

పులి లోపల నల్లరిజేయుచున్నదని విని కుమారున కేమి మోసము వచ్చునో యని వెరచుచు దలుపులు తీయించి లోపలఁ బ్రవేశించి యెదురు వచ్చుచున్న ప్రభాకరుం జూచి యత్యంత సంతోషముతోఁ గౌఁగలించుకొని నాయనా ! యీపులి నిన్ను గరచినదని చెప్పిరి. యెట్లు తప్పించుకొని వచ్చితివని యడిగిన రాజకుమారుం డిట్లనియె.

తండ్రీ ! మనము వినినదంతయు నసత్యము. తప్పంతయు మనయందే యున్నది. ఆపులి సాధువులలో సాధువు. ఆయోగిని కడు మహాన భావురాలు అని యచ్చటఁ జరిగినకథయంతయుం జెప్పెను.

ప్రద్యోతనుఁడా యుదంతము విని మిక్కిలి యక్కజము జెందుచు నందెవ్వరిం బోవలదని యాజ్ఞాపించి కుమారునితో నామెకుఁ గావలసిన సంభారములు తీసికొని స్వయముగా నర్పి౦పుమని చెప్పుచు నందఱితో నింటికిం బోయెను.

ప్రభాకరుఁడు నాఁటి సాయంకాలమున మాంసము ఫలములు పాలు బట్టించుకొని యక్కడికిఁ బోయెను. పులి చచ్చినది. దానిపైబడి యోగిని యిట్లువిచారించు చున్నది.

ఉ. అక్కట! నీవు నన్విడిచి యవ్యయ సౌఖ్యములందఁ బోయితే
    యక్కడ నీపరోపకృతి నాత్మలనెంచి నిలింపు లెల్ల ని
    న్మిక్కిలి గౌరవింతురుసుమీ! మృగరాజమ ! దిక్కుమాలి నే
    నొక్కతె నేమిసేయుదనయో యిటఁగుందుచు మిత్రఘాతినై.

సీ. తెరవుగానక కానఁ దిఱిగెడుతఱి దారిఁ
                  జూపి యథ్వశ్రమ బాపినావు
    యమునానదీ ప్రవాహమునఁ గొట్టికొనిపో
                  వఁగఁ దెప్పవగుచుఁ గాపాడినావు
    తలవరుల్‌ నిలిపి పోవలదన్న హుం కార
                 మొనరించి యాటంక ముడిపినావు
    దుష్టాత్ముఁడగు యోగి ధూళి మీఁదకు నూదఁ
                 దొడబట్టి యవ్వల దోలినావు