పుట:కాశీమజిలీకథలు -07.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభాకరుని కథ

53

అప్పుడా చిన్నది వానిం జూచియుఁ జూడనట్ల భినయించుచు మా తల్లిదండ్రు లితనికే నన్ను, బరిణయముజేయ నిశ్చయించిరి. నా చిత్రఫలకము చూచియున్న కతంబున నిట్ల నెను. ఔరా! దైవ నియోగము యిన్ని దేశములుండ నీ పురమే రావలయునా? అని తలఁచుచు మేము సకల సంగత్యాగినులమగు యోగినులము. మా వృత్తాంతముతో మీకేమిపని? ఈపులి ఘాతుకమైనదికాదు. తన కపకృతి జేసిన వారిం గరచును. ఇతరులజోలికిఁబోవదు. అదియుంగాక రేపో నేడో చావనున్నది. దీనిబాధ మీకుండదు. పొండని పలికి యక్కలికి కన్నులు మూసికొన్నది.

ఆమాట లాబోటి నోటనుండి వెల్వడిన వీనుల కమృతము సోకినట్లు ముఱియుచు నాహా ! ఇట్టి మోహనాంగితో నిమిషము సంభాషించినం జాలదా ? ఇంద్రలోక సౌఖ్యమేమిటికి ? అయ్యో యీమె తపశ్శాలిని అని యెఱిఁగియు నే నిట్లు మోహమందెద నేమిటికి ? ఇది మహాపాతకము. పాతకము శమించుగాక. అని అతండు తలంచు చుండెను.

భటుడు వలదనుచుండఁ బ్రభాకరుడు గోడదుమికి గుడిలోనికిం బోయెననియుఁ బులియాతనిం గరచినదియనియు నెవ్వరో పోయి ప్రద్యోతనున కెఱింగించిరి. ఆ వార్త విని యొడయఁడు కడునడలుచు నపరిమిత పరివారముతో నాయాలయము దాపునకు వచ్చెను. అంతకు పూర్వమే పులి యీవలకు వచ్చునని తలుపులు మూయబడి యున్నవి.

వీరభటులు పటుధైర్యముతో గోడలెక్కి. నలుమూలలు చూచుచుఁ ప్రభాకరుని జాడ నరయుచుండిరి. వింట శరము సంధించి పులిం గురిజూచి వారిలో నొకఁడు వేయుటయు నాబాణ మాపులి కాలికిం దగిలి క్షతము గావించినది.

అప్పుడా వ్యాఘ్రం బదభ్ర విలయాభ్రంబు పగిది నార్చుచుఁ బేర్చిన క్రోధంబున విచిత్ర లంఘనంబుల నాతూపువచ్చిన దారినిపోయి యేసినవానిం బట్టికొని నేలం బడద్రోసినది. అప్పు డందున్న వీరు లందఱు దద్దరిల్లి భయకంపితగాత్రులై నేల కురికి నాయుధంబులఁ జారవిడిచి యధాయధలై పారిపోయిరి.

అప్పుడు జితవతి లేచి యాపులిం జీరినది. అది తృటిలోవచ్చి అందు నిలువం బడినది. దానికాలి వ్రణముజూచి యాచిగురుఁబోణి దుఃఖించుచు వ్యాఘ్రారాజమా? నీకుఁ గౌర్యము సహజమగుట నీవు సాధువైయున్నను నసాధువుగానే తలంతురు. నీమీఁదికి రానిదే నీవెవ్వరికిని హానిసేయవు. ప్రజలు నిన్నెట్లును బ్రతుకనీయరు నీకర్మము నే నేమి సేయుదు నని పలుకుచు నాపుండునుండి రక్తము గారుచుండఁ దన పయ్యెదచే నద్దుచు గట్టుగట్టి మంట తగ్గుటకు నోటితో నూదుచుండెను.