పుట:కాశీమజిలీకథలు -07.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మగును తినుము తినుము. అని బ్రతిమాలికొనుచు నాఫలముల నోటిలోనికిఁ ద్రోసినది.

ఆ పులియు నాచెలి చేయి నోటిలో నున్నంతసేపు నోరు దెరచికొని చేయి తీసినతోడనే యా ఫలముల గ్రక్కివేసినది.

ఆ వింతయంతయుఁ బ్రాంతముననుండి చూచుచున్న ప్రభాకరుడు విస్మయము జెందుచు నౌరా ! యిది యెక్కడి సౌందర్యము ? యెక్కడి పులి ? యోగిని యన నేమియో యనుకొంటిని ఇది యోగిని కాదు జగన్మోహిని. ఆమె పులినోటిలోఁ జేయి పెట్టినను గరువకున్నది. రాజయోగి నెట్లు కరచినదియో ? తపఃప్రభావసంపన్నురాలగు నీ యోగినినిం జూడ నాడెందము కందర్పశరాయత్త మగుచున్న దేమి పాపము ! ఈమగువ నెప్పుడో చూచినట్లున్నదే ? యిట్టి శాంతురాలు పులిచే బ్రజలం బాధింపఁజేయునా? పులి నన్నుఁ జంపినం జంపుఁగాక దాపునకుఁ బోయి యా యింతి వృత్తాంతమడిగి తెలిసికొనియెదం గాక అని తలంచి యా గోడ గుభాలున నురికి యా కలికి దాపునకుం బోయెను.

ఆమె యప్పుడాపులి మొగము తనతొడపై నిడుకొని లాలించుచుండెను. ప్రభాకరుం డామె యెదుటకుఁబోయి వినయవినమితో త్తమాంగుఁడై మ్రొక్కి దేవీ నీవు త్రిభువన పూజ్యురాలవు. నీ దర్శనముఁజేసి నేను గృతార్దుండనైతిని. నాకన్నుల కలిమి సార్ధకమయ్యెను. నేనీ నగరాధీశ్వరుఁడగు ప్రద్యోతనుని‌ కమారుండను. నా పేరు ప్రభాకరుడందురు. ఈపులి ప్రజలం బాధింపుచున్నదనియు రాజయోగిం గరచినదనియుఁ జారు లెఱింగింప నన్నానృపతి నీ యొద్దకు బుత్తెంచెను. విన్నతెరంగు కల్లయని తలంచుచుంటిని. నీవంటి తపశ్శాలిని లోకములకు గీడు పాటించునా? మఱియు నీపులిని ఫలముల దినుమని బ్రతిమాలుచుంటివి. ఇది బేలతనము కాదా? మాంసము తినెడి పెద్దపులి పండ్లు తినునా ? బాగు బాగు. నీవలె నిదియు వ్రతము వహించినదియా యేమి? దీనికి మాంసముఁ దెప్పించి యిచ్చెద. నీవు విచారింపకుము. మఱియు నీ ప్రాయమా ! మొదటిది. రూపమా ! త్రిభువననా సేచనకము. వ్రతమా ! అనన్య దుర్లభము. ఇట్టి నీ వృత్తాంతము విన నెవ్వరి కుత్సుకత్వముగాకుండును ? నీ మొగ మెన్నఁడో చూచినట్లున్నది. నీ జన్మ దేశ మెయ్యది?! తల్లిదండ్రు లెవ్వరు ? ఏమిగోరి యిట్టి కర్కశవ్రతము బూనితివి. అయ్యయ్యో ? ఈ నారచీరలేడ? ఈ దేహ లత యేడ? ఈ జటాకలాపమేడ? పరిష్కరణోచితమగు నీమె నిట్లు శుష్కోపవాసములచేఁ గృశింపఁ జేయుచుంటివేమి? నీ తేజము జూడ నుత్తమవంశ సంజాతురాలవని తోచుచున్నది. విన నే నర్హుండనేని నీ వృత్తాంత మెఱింగింపుమని వినయముతోఁ బ్రార్థించెను.