పుట:కాశీమజిలీకథలు -07.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభాకరుని కథ

51

అర్చ - గోపురము వేదికపైఁబడి మూల్గుచున్నవాఁడు. అది యట్లుండె. నేఁడు స్వామికి నైవేద్యములేదు. గుడిలోనికిఁ బోవుటకు భయమగుచున్నది. ముఖ మంటపములో నాపులి గద్దెవైచుకొని కూర్చున్నది. యేమిచేయవలయునో చెప్పుడు అని నుడివిన విని యారాజు కమారుని రప్పించి ప్రభాకరా ! యోగినీచరిత్రము వింటివా ? పులితో యమునలోఁ గొట్టికొనివచ్చి మన శివాలయములోఁ బ్రవేసించిన దఁట యోగినీప్రభావమున నాపులి యజేయంబై చూచినవారినెల్ల జంపుచున్నదఁట. గుడిలోనున్న రాజయోగిం గరచి ప్రాణావసిస్టుం జేసినదఁట నీవువోయి యా యుపద్రవమునాపి ప్రజలం గాపాడుము. పులి దాపునకుఁబోక వినయముతో నాయోగినిని బ్రార్దించి యవ్వలికిఁ బంపుము. నేఁడుస్వామికి నైనేద్య మాగిపోయినదని పలికిన విని ప్రభాకరుఁ డిట్లనియె.

ఏమీ ? యీయూర నాఘాతుకమృగ మింతక్రౌర్యము జరుపుచుండ నాకేలఁ జెప్పితిరికారు అక్కటా ! రాజయోగిం గరచినదియా ? అయ్యయ్యో ? అతండు బహు తంత్రవేదినని నాతోఁ జెప్పెనే ఆయోగిని వానికన్న నధికురాలు కాఁబోలు. పోయివచ్చెద ననుజ్ఞయిండు. అని పలికిన ప్రభాకరునితో బాబూ పదిలముసుమీ ? మహాత్ముల ప్రభావమచింత్యము. శాంతమునఁబోయి ప్రజల యుపద్రవ ముడిపి రమ్మని చెప్పినంత నా రాజనందనుం డప్పుడ తగుపరివారముతో నర్చకులవెంట శివాలయమున కరిగెను.

గోపురము వేదికపై మూల్గుచున్న రాజయోగిం గాంచి ప్రభాకరుఁడు జాలి పడుచు మహాత్మా ? మీరు పులివాత నేమిటికిఁ బడితిరి ? ఆ యోగిని మహిమ తెలియక నిందించితిరఁట కాదా ? ఇది యొక ప్రారబ్దము చింతింపకుడు అని యూరడించి యుపచారములఁ జేయ గొందఱఁ బరిచారకుల నియమించి వేరొక మందిరమునకు బంపెను.

తరువాత అతండు గుడిలోపలి యావరణలోనికిం బోవ బ్రయత్నించిన అర్చకులు వారించిరి. అప్పుడు గోడ యెక్కి లోపలి విశేషంబులఁ బరికింపు చుండెను.

అప్పుడా చిన్నది తన రెండు చేతులతో నాపులినోరు పెకలించి ఫలముల లోనికిఁ జొనుపుచు మృగేంద్రమా ! నన్నేల వేపెదవు ? ఆహారము దినక యెన్ని దినము లిట్లుపవాసము జేయుదువు? ఈ ఫలముల భక్షింపుము అయ్యో ? నీ డొక్కలు రెండు అంటుకొనిపోయినవిగదా నా కర్మము నీ సహవాసము నాకేల రావలయును యోగసక్తను శాపగ్రస్తం జేసితివి నీవునుం గుడువక గెడసితివేని నాచెలిమి సాద్గుణ్య