పుట:కాశీమజిలీకథలు -07.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కాశీమజిలీకథలు - సప్తమభాగము

మంత్రరహస్య విశేషము లుపదేశించెద నని పలికిన నాకలికి ఇంచుక కన్నులు తెరచి చూచి సన్యాసులందఱుఁ గపటాత్ములని నిశ్చయించుకొనియున్న కతంబున వాని మన్నింపనొల్లక మరల కన్నులు మూసికొని యేమియు మాట్లాడినదికాదు.

అప్పుడాసన్యాసి మోమున నలుకదోప సెభాసు ? మంచియోగినివే. నా మహిమ యెఱుంగక యవమానము జేయుచున్నదానవు నీ పులి క్రౌర్య మడంచినట్లె నీగర్వ మడంచెదను చూడుము అబ్బా జేగురుగుడ్డఁ గట్టినంతమాత్రమునఁ బెద్దలఁ దిరస్కరింపవలయునా ? యిప్పుడు నాపాదములంబట్టి శరణుజొచ్చిన మంచిది. లేకున్న నిన్నిప్పుడు కుక్కను జేయిదు చూడుము. అని పలుకుచు భస్మ మరచేతిలోఁ బోసికొని యేదియో యుచ్చరించుచు నాపైదలిమీది కూదెను. అప్పుడా చిన్నది మోము చిట్లించుటఁజూచి యాపులి విలయకాల వరాహకము భంగి బొబ్బఁబెట్టుచుఁ గొబ్బున నాసన్యాసితొడఁ బట్టికొని నేలం బడద్రొసి యవ్వలి యావరణలోని కీడ్చుకొనిపోయినది.

అప్పు డప్పడఁతి అయ్యయో ? చంపకు చంపకు మృగరాజమా విడు విడు అని కేకలు వైచుచు వెంటఁబడినది ఆసన్నగ్రహించి యా సన్యాసి నాసన్నమరణుం జేసి యంతటితో విడిచి యప్పడఁతి యొద్దకు వచ్చినది అప్పు డందున్న వారందరు పెద్దపులి సన్యాసిం జంపినది చంపినది అని యరచుచుఁ దమ్ముఁగూడఁ జంపునను వెరపుతో గోడలెక్కియు ద్వారముల దూరియు నవ్వలకుఁ బారిపోయిరి.

అని యెఱింగించి - ఇట్లని చెప్పందొడంగెను.

110 వ మజిలీ.

ప్రభాకరుని కథ

ప్రద్యోతనుఁడు - తరువాత తరువాత

అర్చకులు -- దేవా ! రాజయోగి వట్టి డాంబికుఁడు. అతని మంత్రమువలన బులి నిలిచిన దనుకొంటిమి. యేమియునులేదు. అ త్తాపసిపైఁ బూతి నూదినం జూచి గాండ్రుమని యరచి తొడఁగరచి యీడ్చుకొని పోయినది. ఆచిన్నది అడ్డ పడకున్న నీపాటి కాసన్యాసి సమాధిలో నుండును‌ దేవా !

రాజు - రాజయోగి బ్రతికియున్నవాఁడా ?

అర్చకులు - చావుతప్పినదికాన గాయము లింతటిలో గుదరవు.

రాజు - అయ్యోపాపము వానికిఁ దగిన నుపచారములు జరుగు చున్నవియా? ఇప్పు డెందున్నవాఁడు ?