పుట:కాశీమజిలీకథలు -07.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7]

రాజయోగి కథ

49

పులింజూచి లోపలదూరితిరేల ? పులియావలఁ బోయినది తలుపులు తీయుఁడని పలుకుటయు నయ్యోగి కవాటములఁ దెరచి లోనికిరండు అది క్రమ్మర నిటు రాఁగలదు భస్మము జల్లి వశపరచెదఁ జూడుడు నామహిమచేతనే యిందు వచ్చినది. క్షణ మోర్వుఁడని పలికి వారినందఱ లోపలికి రమ్మని తలుపువైచి భస్మము మత్రించు చుండెను.

అంతలో నాతలోదరి రెండవ ప్రదక్షిణము చేయుచుఁ బులితో నీదరిం బోయినది అప్పుడా మంత్రభస్మము పులిపైఁ జల్లుచు నాయోగినీ సౌందర్య మక్కజ పాటుతోఁ జూచిచూచి కందర్పభల్లముల కుల్లము వశపరచి పరవశుండై యుండెను.

ప్రజలు స్వామీ ! మంత్రభస్మము జల్లితిరిగదా. ఇఁక మేము పోవచ్చునా యని యడిగిన పొండు పొండు ఆపులి మీజోలికి రాదని యుత్తరము జెప్పెను

మూఁడవ ప్రదక్షిణములో నాపులి వారికన్నులం బడినతోడనే వారిలో నొక మొండివాఁడు చొరవజేసి దానివెంబడి నడువసాగెను. అది వాని నేమియుం జేయకుండుటఁజూచి మరికొందఱు మెల్ల మెల్ల వెనుక నడువజొచ్చిరి. ఆపులి యెవ్వరి వంక జూడక యాచేడియ వెనుక సడుచుచుండెను. క్రమంబు నందున్నవారందఱు రాజయోగి మంత్రబద్ధంజేసెనని నిశ్చయించి వెరపుడిపికొని యాపులి దాపునకుఁ బోయి చూచుచుండిరి.

ఆపూవుఁబోణియు దేవుని ముమ్మారు వలఁగొని స్వామియెదుర నిలువంబడి కన్నులు మూసికొని ధ్యానించుచుండెను. అప్పుడాపులి యాచెలిమ్రోల గద్దెవైచుకొని కూర్చుండెను. ప్రజలు వింతగాఁ జూచుచుండిరి.

కొందఱా రాజయోగియొద్డకుఁబోయి మహాత్మా ! నీమంత్రమహిమ మిగులఁ గొనియాడఁదగియున్నది. ఆపులి చూచినంతనే మీదఁపడి చంపుచున్నదని చెప్పుకొనుచున్నారు అట్టిజంతు విప్పుడు దూడవలె నెవ్వరిజోలికిం బోక దేవునిమ్రోల గద్దె వైచుకొని కూర్చున్నది. మీరువచ్చి చూడుఁడని చెప్పిన నుబ్బుచు నాసన్యాసి ఇసిరో! యిది యొక యబ్బురమా ! పులిమాటయేమి ? చెలింగూడ శిష్యురాలిం జేసికొనియెదఁ జూడుఁడు అని పలుకుచు నందుండిన ముఖమంటపము దాపునకువచ్చి యచ్చిగురుబోణి నెగాదిగఁ జూచి కనుబొమ్మ లెగరవైచుచు నిట్లనియె.

యోగినీ ! నన్నిటు చూడుము నీకంటెఁ బెద్ధలమగు యోగుల మిందుండ వచ్చి నమస్కరింపకుండుట తిరస్కారభావముగదా ? ఇది యోగినీధర్మమే ? నే నుత్తరదేశారణ్యములలోఁ బెద్దకాలము తపముజేసి ప్రస్తుతము లోకోపకారమునకై దేశాటనము చేయుచున్నవాఁడ. నా పేరు రాజయోగియండ్రు. నా నెలవునకురమ్ము.