పుట:కాశీమజిలీకథలు -07.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయా వసిష్ఠుని కథ

47

జుట్టును మూఁగికొని నడుచుచుండిరి. వారిలో నెవ్వఁడో కొంటెతనమునకై పులిపై ఱాయిరువ్వెను. అప్పుడవ్వనచరంబుదురంత క్రోధంబున గాండ్రుమని అరచుచుఁ గొట్టిన వానిం దరిమికొని పట్టి పొట్టఁ జీల్పబోవుఁడు నానెలత ఆఁ ఆఁ వలదు వలదు. అని పలుకుచు బరుగునఁ బోయి యా యాపదఁ దప్పించినది.

అప్పుడు ప్రజలు భయోద్రేకంబునఁ ద్రోకఁదెంపిన పిట్టలవలె నూరుదెసలకుఁ బరుగిడఁదొడఁగిరి. అమ్మగువయు నా మృగముపైఁ జేయి వైచి మెల్లన నడుచు చుండెను. “కాళిందీ ప్రవాహంబున నొక యోగిని‌ పులితోఁ గొట్టికొనివచ్చి గట్టెక్కినది. కనంబడిన వారినెల్ల నా పులి చంపుచున్నది. యమున కెవ్వరునుఁ బోగూడ"దని పట్టణ ప్రజలొకరితో నొకరు జెప్పుకొనుచుండిరి.

అక్కాంతయు గొంతదూరము నదీతీరమున దక్షిణముగాఁ బోయి పోయి యా మార్గంబు పడమరగానున్న నీటిలోనికి మఱలుటయు దానింబడి నడుచు చుండెను. ఆమె వెంటఁ గుక్కవలె వచ్చుచున్న పులింజూచి పశువులు పారిపోవు చుండెను. యెదురుపడిన జనులు సదనంబుల దూరుచుండిరి. శకటంబులు లాగికొనివచ్చు ఘోటకంబులు బాటనమ్మేటి మెకంబు గనంబడినతోడనే బెదరి సాదులు మేదిని కురుకబండ్లు తబ్బిబ్బులుగాఁగఁ బగ్గంబులం ద్రెంచుకొని పెడత్రోవలం బారి పోవుచుండెను.

అప్పుడా అలజడివిని వీరభటులు పెక్కండ్రాయుధ పాణులై యడ్డము వచ్చి మచ్చెకంటీ ? నీ వెవ్వతెవు? క్రూరమృగము నీవిటు లేమిటికిఁ దీసికొని వచ్చితివి ? దీనింజూచి పౌరులు బెదరుచున్నారు. నీవు నగరములోనికి రావలదు పోపొమ్ము దీని మేము జంపెదమని పలుకు చుండఁగనే యాసత్వంబు సత్వరము వారి పయింబడి తొడలంగఱచి పిక్కలంబట్టిగొని మెడలఁ గోరలఁజొనిపి, దవడలఁ గోళ్ళఁగ్రుచ్చి వీపులఁగాళ్ళఁ జదిమి వీఁక నమ్మూకలఁ దృటిలోఁ జీకాకుపరచుటయు నాభటు లాయుధంబులఁ బారవైచి కేశపాశములు వీఁడ గట్టుపుట్టంబులు జార వేరుజూడక కాలి కొలది నలుదెసలకుం బారిపోయిరి.

అ త్తెఱవయు నత్తెరఁగరిసి కరసరసిజంబున దాని మేను నిమురుచు మృగ శార్దూలమా ? నీవట్లు ఘాతుక కృత్యంబులు గావించినఁ బ్రజలు నిన్ను బ్రతుక నిత్తురా ? అయ్యో ? నా ప్రాణ బంధువురాలనగు నీవు సమసిన నా బ్రతుకేమి కావలయు? తొలుత నన్నుఁ బరిమార్పుము. అక్కటా ! నీవంక జూడకున్న నీవెవ్వరి జోలికిం బోవు కొట్టిన వారింబట్టుదువు ఆ తెర వెఱుంగక జనులూరక నిన్నుఁ జూచి వెఱచి పఱుచుచున్నారు ఔరా? ఈ వీధి ఆంతయు నిర్జనంబై నది. ప్రజలు లోపల