పుట:కాశీమజిలీకథలు -07.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కాశీమజిలీకథలు - సప్తమభాగము

కరిగి వశ్యౌషధములు గొన్ని సంగ్రహించుకొని వత్తుము. అని చెప్పి యాపిన్న యోగు లిరువురు నాఁవేకువజామున లేచి ప్రయాగమున కరిగి మనోహరదాసుం జూచి యిట్లనిరి.

ఆర్యా ! కార్యావసరమిప్పటికి వెండియు మాకుఁ గలిగినది. ఆ కొమ్మల నెట్లో మాతోఁగూడ సంచరించునట్లు చేసితిమి. కాని వాండ్రు మాట్లాడరు. ఇప్పుడు వారినెట్లు వశము చేసుకొనవలయునో చెప్పవలయును మీ యొద్ద నున్న తంత్రములన్నియుఁ బరిశీలించి మాయభీష్టము తీర్పవలయును. మునుపటివలెనే కాక మీఁద జల్లి నంత మోహపరవశయై మీఁద బడునట్టు మందీయవలయునని మిక్కిలి వినయముతోఁ బ్రార్థించిరి.

ఆ మనోహరదాసు మరల వారివలనఁ గొంత సొమ్ము దీసికొని సుమతులారా ? మీ యందలి ప్రేమచే నీసిద్ధౌషధం బిచ్చుచున్నవాఁడ నింతకుముందీమందెంతవారికి నీయలేదు. దీని ప్రభావ మద్భుతము. ఈయాకు నీటిలోముంచి పసరు వచ్చునట్లు తడిపి కోరిన నారీమణి యురోభాగంబున వైచి రుద్దవలయును. ఆ ద్రవ మేమాత్రమైనను మేనిలో మిళితమయ్యెనేనినిఁక చెప్పనేల నా లలనకు మేను బరవశమై అతఁడే మన్మదుండుగాఁ దోఁచును. అతం డెక్కడికిఁబోయిన అక్కడికిఁ గుక్క లాగున వచ్చును. దీనిం గొనిపొండు. మీ యభీష్టము దీర్చుకొండని పలికి యొక యాకిచ్చి వారినం పెను.

వాండ్రిద్దరు కడు సంతసముతోఁ జంపకారణ్యమునకుఁ బోవుచు దారిలో నిట్టి సంవాదము గావించిరి.

చిదా -- ఓరీ ? యామందు నా కిచ్చుచుండ అడ్డము వచ్చి నీవందుకొంటివేమి ? నాయొద్ద నుండఁదగదా యేమి? నీ యభిప్రాయమేమి?

రమా - అట్లు కచ్చితముగా అడుగుచుంటివి. నే నందుకొననర్హుఁడగానా ?

చిదా - ఇరువురము సమానులమే. ఇందు న్యూనాధిక్యములు లేవు. నా కడ్డము రానేల అని అడిగితిని.

రమా -- అడుగవచ్చును. మొగము చిట్లింపనేమిటికి ?

చిదా - కానిమ్ము. ఆమెపై పసరుపిండివా రెవ్వరు ?

రమా - నేను నీకంటెఁ జిన్నవాఁడను కావున నేను బిండెదను. వశవర్తిని యైన పిమ్మట నీ కర్పించెదను. మన యిద్దరిమధ్యను పాండవులను ద్రౌపదివలె అయ్యండజగమన యుండఁగలదు.

చిదా -- అబ్బో ! ఈ కపటోక్తుల కేమిలే. నేనంత యెఱుంగని వాఁడను