పుట:కాశీమజిలీకథలు -07.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కాశీమజిలీకథలు - సప్తమభాగము

చెప్పలేదా ? క్రమ్మర నా ప్రనంగమే తెచ్చిదవేమి? కొన్నిదినము లిందుండి శుశ్రూష గావింపుము. వారికే దయవచ్చి నీవు చెప్పినట్లు చేయఁగలరు. తాపసు లల్పసంతోషులని విని యుండలేదా ? పాదముల విడువుమని యుపదేశించిన విని యవ్వనితామణి యట్లు చేసినది. రోహిణి యాబడుగుజడదారి మొగము జూచుచు నట్లే నిలువంబడి యుండెను. బ్రహ్మానందుఁడు వారిం గూర్చుండ నియమించెను. అందరుగూరుచుండిరి. అప్పుడు జితవతి మెల్లగా యోగీంద్రా అరుంధతీమహాదేవికూడ రాలేదాయేమి యని అడిగిన బ్రహ్మానందుఁడు యువతీ ! అద్దేవి వారి యాశ్రమములొనే యున్నది. ఇందు రాలేదు. వీరు విలాసముగాఁ దీర్ఘాటనము సేయ బయలు వెడలిరి. కొలది తరిలో వీరింటికిఁ బోవుదురు. మీ పుణ్యమువలన నిచ్చటికి వచ్చిరి. కాని యిది వీరి నెలవు కాదని యేమేమో చెప్పెను. కాని యమ్మానినుల కనుమానము తీరినది కాదు.

అప్పుడు బ్రహ్మానందయోగి అల్లంతదూరమున నొకపర్ణశాల వేయించి వారి నందుండ నియమించెను. అందుఁ బ్రవేశించి రోవాణి యేకాతముగా జితవతీ ! యీతండు వసిష్ఠ మహర్షియని నీకు నమ్మకము దోచినదా ? వాని మొగమందుఁ దేజమేమైనం గలదా ? బడుగు వాని నెవ్వనినో దీసికొనివచ్చి యిట్టి వేషము వైచి యీ పిన్న సన్యాసులీకల్పతమును చేయుచుండిరి. మనము వీరివలలోఁబడి యీ ఆరణ్యమునకు వచ్చితిమి. వీరి యభిలాషలు వేరుగా నున్నవి, ఇప్పు డేమిచేయఁ దగినదో వితర్కింపుమని పలికిన విని జితవతి యిట్లనియె.

సఖీ ! ఈ విషయము నాకును ననుమానము గలుగుచున్నది. వాని మొగమునఁ దేజము లేకపోవుట యొకటి యరుంధతీ మహాదేవి యెన్నఁడును భర్తను విడిచి యుండదని జగత్ప్రతీతికాదా ? కానిమ్ము ఏమి చేయుదుము. బరమేశ్వరుడు లేడా ? ఇట్టి కల్పితము చేసినంత వీరి కేమి లాభము వచ్చినది. మనము వీరికి వశుల మగుదుమా? మునుపే చావఁ దెగించియుంటిమి. అయినను రహస్యముగా వారి చర్యలఁ బరీక్షించిరమ్ము అని బోధించినది.

మరియొకనాఁడు రాత్రి చీకటిలో నాపర్ణశాల దాపునకుఁబోయి గూఢముగా గూర్చుండి వారిమాట లాలించినది.

రమానందుఁడు -- ఏమిరా బడుగ ? ఆపడతులలో దిట్టముగా మాట్లాడలేవేమి ? మే మే యని నోటిలో నేదియో గొణికికొనియెదవేమిటికి ? నీవు వసిష్ఠుడవు కావని యాపూవుబోణుఁ లనుమానము జెందుచున్నట్లు తోచుచున్నది.

యోగి - నే నేమి చేయుదును. బోసినోరు మూలమున మాట స్పష్టముగా