పుట:కాశీమజిలీకథలు -07.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయా వసిష్ఠుని కథ

39

అప్పుడు జితవతి నిరతిశయభక్తి విశ్వాసములతో అతని పాదంబులం బడి మహాత్మా! కరుణించి నా విన్నప మాలింపవలయను. మీరు సర్వజ్ఞులు. దివ్యదృష్టిసంపన్నులు. దయాహృదయులు. తేజోనిధులు. మీరెఱుంగని ధర్మంబులు మర్మంబు లుండవు. వసుపత్నియగు యోగసక్త సత్యవతియు విద్యావతియు జ్ఞానవతియు అని చేయెత్తి శపధముచేసి చెప్పఁగలను. అ సాధ్వీతిలకముతో దైవవశంబున‌ మశక శిశువునకు మాతంగముతోడంబోలె నాకు మైత్రి గలిగినది. నేనామెను మానవదుర్లభమగు వరం బడిగితిని. నాకోరిక నీడేర్చు తలంపుతో నా పుణ్యాత్మరాలు మీయావుం గట్టి తెమ్మని వసువుల నియమించినది. అమె స్యార్ధపరురాలై అప్పని చేయింపలేదు. అప్పని తప్పని యెఱుంగదు. చౌర్యము జేసియైనఁ బరోపకారము చేయుట పుణ్యమని పెద్దలు చెప్పుదురుగదా ? పరోపకారపారీణు లగునట్టి వసువుల మీరు శపించినట్లు వింటిని. ఆశాప మెట్టిదో తెలుపుఁడు. వారింగనికరించి శాపవిముక్తులఁ జేయుట యుచితము. అదియు నా యభిమతము. కాదంటిరేని అందులకు మూలహేతువునగు నా పైనా శాపము వ్యాపింపఁజేయుఁడు. నే నది యెట్టిదైన భరించుదాన. నిరపరాధులగు వసువులు దండింపఁబడిరని వినినదిమొదలు నాహృదయము భేదిల్లుదున్నది. నాకేపనియుం దోచదు నేను నట్టి పాపాత్మురాల మఱియొకటి కోరక అట్టివరం బడుగ నేలఁ నే నడుగకున్న వారికీయిక్కట్టు రాదుగదా? అక్కటా ? నేను మనుష్యులలోఁ గడు హీనురాలనైతి. నా బ్రతుకు నిరర్థకమైనది. మిమ్ము శరణుజొచ్చితిని. వారి శాపవిముక్తులం జేయుదు ననుదనుక మీ పాదములనుండి లేవను. మీ పాదమూలమునఁ బ్రాణముల బాపికొందునని పలుకుచు నుచ్చస్వరంబున గోలుగోలన నేడువ దొడంగినది.

అప్పు డాయోగి యబలా ? వసువులుజేసిన అపరాధము కనికరింపఁదగినది కాదు. వారిపేరు దల పెట్టినంత నాకినుక బ్రబలుచున్నది నీవిప్పుడేమియు వారి విషయ మడుగవలదు. కొన్నిదినము లిందుండుము. చిత్తము విశ్రాంతి పడిన పిమ్మట అంతయుం జెప్పెదను. నీవు విచారింపవలదు. లేలెమ్ము. నీయెడ మా కనుగ్రహము గలిగినది. అని పలికిన విని అక్కలికి వెండియు స్వామీ ! వారిప్పు డెక్కడ నున్నారు వారితో యోగసక్త వచ్చినదా? ఏమని శపించితిరి. యోగసక్త నాకన్నులంబడునా ? అని యడిగిన నా బడుగు సన్యాసి యేమియు మాటాడక కన్నులు మూసికొనియెను.

అప్పుడు బ్రహ్మానందయోగి నలినాక్షీ ! నీవిప్పు డతి ప్రసంగము గావింపకుము. వారికిఁ గోపము రాఁగలదు. వసువులవృత్తాంత మిప్పుడేమియుఁ నడుగవలదని