పుట:కాశీమజిలీకథలు -07.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కాశీమజిలీకథలు - సప్తమభాగము

సఖీ ! యా మహాత్ముని యుపన్యాసము వినంబడుచున్నదా? చెవి కమృతబిందువులవలె సోకుచున్నది గదా ! బ్రహ్మానందయోగిని బ్రహ్మవేత్తలలో నగ్రగణ్యుఁడని చెప్పఁదగినది. అట్టివాఁడు వారి మాటలు విని మనలఁ గపటముజేసి దీసికొని పోవు చున్నాఁడని చెప్పుదువు. నీమాట యెంత నమ్మదగినదో చెప్పుము. ఇఁక శంకవిడిచి నిర్భయముగా వారివెంట నడువుము. మన కార్యసిద్ధి శీఘ్రముగాఁ గాగలదని పలికిన విని రోహిణి యేమాటయుంబలుక కూరకుండెను. అట్లు వారు పోయిపోయి రెండు మూడుపయనంబులకుఁ జంపకారణ్యము జేరిరి.

అని యెఱింగించి --యిట్లనియె.

107 వ మజిలీ

మాయా వసిష్ఠుని కథ

డెబ్బదియేండ్లు మించినవి. నల్లని దేహము. పండ్లూడినవి. చప్పిదవడలు. కన్నులు లోతునకు బోయినవి. ఒడలంతయు ముడుతలు వారినది. మేనంతయు విభూతిబూసి రుద్రాక్ష మాలికలు జుట్టి మహర్షి వేషము వేసినను దర్శనీయముగా లేదు. బట్టతలపై నంటగట్టిన జడల చుట్ట కృత్రిమమని చూచువారికిఁ దెలియక మానదు. అట్టి యోగి యొకఁ డొక యరణ్య మధ్యంబున నొక చెట్టుక్రింద వ్యాఘ్రాజితముపై గూర్చుండి జపము జేసికొనుచుండెను. దండము కుండిక శాటిపటములు గొన్ని యా ప్రాంతమం దున్నవి. ఆ యోగి కన్నులు మూయుచుఁ దెరచుచు నలుదెసలం జూచుచు జపము జేయుచున్న సమయంబున జితవతియు. రోహిణియు వెంటరా నిరువురు శిష్యులతో బ్రహ్మానందయోగి యచ్చోట కరుదెంచెను. ఆ యోగి యంతలోఁ గన్నులందెరచి యోహో? బ్రహ్మానందుఁడా ? ప్రయోగమున నింత జాగు జేసితి వేమిటికి ? నీ కొరకు నిరీక్షించు చున్నానని యడుగుటయు నతం డిట్లనియె.

మహాత్మా ! పోయినది పుణ్యతీర్థముగదా ? చదివినది వేదాంతము తపశ్చరణమే కృత్యము ఇట్టి మన కెందుండిన నేమి? ఒకచో నొక ప్రయోజనముగలదా యేమి ? మీరిందునాకు నేనింతకన్న కొంతకాలమందే యుండువాఁడను. అది అట్లుండ నిండు. ఇప్పుడు వేరొకకార్యము మీతోఁ చెప్పవలసియున్నది.. ఈ బాలయోగినులు సకలభోగముల నిడిచి పెద్దదూరమునుండి మీ దర్శనమునకై యరుదెంచిరి. మీరున్న నెల వెఱింగింప నన్నాశ్రయించుటచే వెంటఁ దీసికొని వచ్చితిని. మీకోరిక యెద్దియో తెలిసికొని సఫలము గావింపవలయు. నిదియే నా హెచ్చరిక యని చెప్పుచు నా జవరాండ్ర నిరువుర వాని యెదుటకు రప్పించెను.