పుట:కాశీమజిలీకథలు -07.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మానందయోగి కథ

37

పోవుచున్నారు. చిదానందుని చేష్టలన్నియు హావభావ గర్భితములై యున్నవి ఈ బ్రహ్మానందయోగి నాశ్రయించి యిట్టి కల్పనజేసి యుందురు. యేమి చేయుదును? పోవలదని చెప్పినను జితవతి వినిపించుకొనదు. నా బుద్దిబలంబంతయు నేటిపాలుఁజేసి వీరి వెంటఁ బోవుచుంటిని. వసిష్ఠుడీ యడవిలో నుండుట కల్ల. మోహాందులై వీరిట్టి సన్నాహము గావించి యుందురు. కానిమ్ము. ఏమి జరుగునో చూడవలసినదేకాని దైవమును మీరగలమా అని అనేక ప్రకారములఁ దలంచుచు వారివెంటఁ గొంచె మెడముగా నడచుచుండెను. బ్రహ్మానందయోగి నడుచునప్పు డేవేని తత్వవిశేషము లెఱింగింపుఁడని శిష్యు లడిగిన నిట్లుపన్యసించెను.

వత్సలారా ! ఈ ప్రపంచకము మాయాకల్పితము. దృశ్యమంతయు నశ్యమే సుఁడీ? ఈశ్వరుఁడొక్కడే నీతుఁడు. ఈశ్వరుఁడు ప్రకృతియందుఁ ప్రతిఫలించి జగంబుల రచించుచున్నట్లు తోచుచుండును కాని కర్తృత్వ భోక్తృత్వము లేవియు లేవు. అదియు నింద్రజాలము వంటిది. ఆ రూఢులకుగాని‌ యీ రహస్యము దెలియదు. ప్రపంచకమే యసత్యమనుచుండ దేహముమాట జెప్పనేల? స్వప్నంబునఁ దోచిన వస్తువు లన్నియు మేల్కొనిన గనంబడనియట్లు ఆత్మవేత్తయగు జ్ఞాని కీ లోకమేలేనట్లు తోచును. ఇంద్రియ సంమోహము వలననే యీ యజ్ఞానము గలుగుచున్నది. (వెనుక జూచి మెల్లగా, వారీ మాటలు వినుచున్నారా) అని మరియు.

శ్లో॥ శారీరై ర్మానిసైర్దుఃఖైః సుఖై ర్వాప్య సుఖోదయైః।
     లోకసృష్టిం ప్రపశ్యంతో నముహ్యంతి విచక్షణాః।
     తత్రదుఃఖ విమోక్షార్థం ప్రయతేత విచక్షణః।
     సుఖంహ్య నిత్యం భూతానా మిహలోకె పరత్రచ।
     రాహుగ్రస్తస్య సోమస్య యథాజ్ఞోత్స్నా సభాసతే।
    తదా తమోభి భూతానాంనస్యతే సుఖం॥

శరీర సంబంధములు మనస్సంబంధములగు సుఖదుఃఖములచే లోకసృష్టి ప్రకారమంతయుం జూచుచుండిన విద్వాంసు లెప్పుడును మోహమును బొందరు. రెండును ననిత్యములని యెరింగి తజ్జన్యంబులైన సంతోషశోకముల జెందరు. రెండు లోకము లందు సుఖమనిత్యమని తెలిసికొని దుఃఖవిమోచనార్థమే ప్రవర్తింతురు రాహుగ్రస్తుండగు చంద్రునియొక్క వెన్నెలవలెనే యజ్ఞానాభిభూతములగు భూతములకు ధనము నశించును. కావున లోక ప్రవృత్తి దెలిసికొని దుర్గుణముల విడిచి శమదమాది సంపత్తిచే నొప్పుచుండువాఁడు. ముక్తుండగునని యెఱింగించుచుండ నాలించి జితవతి రోహిణి కిట్లనియె.