పుట:కాశీమజిలీకథలు -07.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కాశీమజిలీకథలు - సప్తమభాగము

నవసరములేదు. తత్వవేత్తలగు సాధువులకుఁ బరోపకృతికన్న ముక్తిసాధన మేమి యున్నది. కూర్చుండుఁడు, అని యాదరించుటయు నాతని మాటలు విని‌ జితవతి యుప్పొంగుచు నిట్లనియె.

స్వామి ! అమ్మాహర్షితో మీరు కొంతకాలము సహవాసము చేసితిరఁట కాదా ? చంపకారణ్యమున మనము పోవుదనుక నుందురా? అరుందతీ మహాదేవికూడ వచ్చినదా ? వారి హృదయ మెట్టిది? మమ్ము గనికరించునా ? వసువుల విడుచుట యొండె తచ్చాపము నాపై వ్యాపింపఁజేయ వసువుల విముక్తులఁజేయుట యొండె గావింపవలయును. అని‌ యేమేమో యడుగఁబోవుచుండ వారించుచు రోహిణి యిట్లనియె.

జితవతీ ! నీవేటికి వీరి నిట్లు ప్రశ్న శ్రవణాయాన పాత్రులం గావించెదవు? వారి యొద్దకుఁ బోయిన వెనుక మనకే దెలియనగు. విచారింపకుమని బోధించినది. అప్పుడు బ్రహ్మానందయోగి అబలలారా ? వినుండు మీరు మిక్కిలి శ్రమపడి యడవులదాటి నిద్రాహారములు విడచి తనకడ కరుదెంచిన మిమ్ము కనికరింప వసిష్షమహర్షి లోకనింద పాలుపడునా యేమి అదియును గాక.

శ్లో॥ అతిధిర్యస్యభగ్నాశో గృహత్ర్పతి నివర్తతెఁ
     సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాయుశ్చగచ్చతి॥

అతిధి యెవని యింటికివచ్చి‌ కామ్యమును బొందక విచారముతోఁ గ్రమరునో యా గృహపతికిఁ దన పాపమిచ్చి వాని పుణ్యమును గైకొని పోవునని శాస్త్రములు చెప్పుచున్నవి. కావున వసిష్టుండు మీ వాంచితమును దీర్పఁగలడు. మనము పోవు దనుక నందే యుండును. మీరు చింతింపవలదని బోధించుచు శిష్యులతో నప్పుడే పయనము గావింపుడని నియమించెను.

అప్పుడా శిష్యులిరువురు శాటీపటములు కమండలువులు నాగ బెత్తములు లోనగు వస్తువులన్నియు మూటగట్టుకొని స్వామీ ! లెండు లెండు. సమయమైనది. అని చెప్పిన నయ్యోగి యోగదండంబూతగా బూని యుత్తరాభిముఖుఁడై యమ్మత్త కాశినులు వెంటరా మెల్లగా నడువజొచ్చెను..

అట్టితరి రోహిణి మనంబున నిట్లు తలంచెను. ఆహా ! విధి పరిపాకము కడు చోద్యమయినదిగదా? పెక్కండ్రు చేడియ లూడిగము సేయ పోతుటీగకైనఁ బ్రవేశింప శక్యముగాని శుద్దాంత సౌధాంతరంబుల వసించు నీ మించుబోఁణి యిట్లు పాదచారిణియై మహారణ్యములోఁ గంటక ప్రదేశముల నెరుగని సన్యాసులవెంట నరగుచున్నది‌. ఇంత కంటె విపరీతమేదియైనఁ గలదా? ఔరా తలంప మాయత్నము చిత్రముగాక యేమి యిది? ఇప్పుడీ పడుచు బైరాగు లిద్దరు సుక్కిపము జేసి యెక్కడికో లాగికొని