పుట:కాశీమజిలీకథలు -07.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కాశీమజిలీకథలు - సప్తమభాగము

లతో వారి కేమిప్రయోజనము ? మనయొద్దఁ దొడవులైన లేవుగదా ? బూడిద బూసికొని తిరిగెడి మన చక్కదనము వలచుఁ వారెవ్వరు ? ఆ మాట సత్యమని ముమ్మాటికి నమ్మదగినది. బోవుదము లెమ్ము బ్రహ్మానందయోగిపాదంబులం బడి వేగ దీసికొనిపొమ్మని ప్రార్థింతమని తొందర పెద్దనది.

రోహిణియు నంగీకరించినది. అప్పుడే యిరువురు బయలుదేరి వృద్ధయోగి కరిగిరి. నిరీక్షించుకొని రమానందుఁ డందేయుండెను. వృద్దయోగి వారింజూచి సుమతులారా ! మీ రిద్దరేనా వారియొద్దకుఁ బోవ నిశ్చయించుకొంటిరి శుభము శుభము. శీఘ్రముగా వీనివెంటఁ బొండు బ్రహ్మానందయోగియొద్దకుఁ దీసికొనిపోవును. తరువాత అతండన్నియుం జెప్పగలండని పలికి వారి మ్రొక్కులు గైకొని దీవించుచు సాగనంపెను.

రమానందుఁడు ముందు నడుచుచుండ ఆయ్యండజగమన లిరువురు కొంచె మెడముగా నడువఁదొడంగిరి. రెండుగడియలలో నా బ్రహ్మానందయోగియొద్ద కరిగిరి.

యమున యొడ్డుననున్న యొక తోటలో మఱ్ఱిచెట్టు క్రింద వ్యాఘ్రాజినముపై గూర్చుండి కన్నులు మూసికొని‌ యాబ్రహ్మానందస్వామి జపము జేసికొనుచుండెను. అతని ప్రాయము ఏబదియేండ్లకు మించియున్నట్లు సగము సగముగాఁ దెల్లబడుచున్న జడలచేఁ దెలియబడుచున్నది. దేహము దృఢముగా నున్నది విభూతి రుద్రాక్షలు నిబ్బడిగా ధరింపబడియున్నవి. చూచువారి కతండు మహానుభావుండని తోచక మానదు. ఆయోగి ప్రక్క నొక శిష్యుఁడు గూర్చుండి జపమాల ద్రిప్పుచుండెను. శాటీపటములు కొన్ని శాఖలకు నారవేయఁబడియున్నవి. ఈతఁడే మా యాచార్యుండని రమానందుఁడు చెప్పినంత నక్కాంత లిరువురు భయభక్తి విశ్వాసములతోఁ బ్రదక్షిణ నమస్కారములు గావించి యోరగా నిలువంబడిరి.

అప్పుడు రమానందుంజూచి అందున్న శిష్యుఁడు మిత్రమా ! ఈ యాఁడు వాండెవ్వరు ? ఇక్కడి కేమిటికి వచ్చిరి. స్త్రీ ప్రసంగమన మండిపడియెడు మన జడదారి దారియెఱింగియు నీ నారీమణుల నేమిటికి వెంటఁబెట్టుకొని వచ్చితివి ? ఇది కడు ప్రమాదముసుమీ ? అని పలికిన విని రమానందుఁడు చిదానందూ ! వీరు లోకసామాన్య యోషలుగారు మహాయోగినులు దృఢవ్రతలు. క్రియాశూరులు. వీరిప్పుడు వసిష్ఠమహర్షి యాశ్రమమున కరుగ నిశ్చయించుకొనిరి. మనగురుని కటాక్షముండినంగాని అట్టిపని కొనసాగదని తలంచి వీరి నాశ్రయింపవచ్చిరి వృద్ధయోగియు వీరికిట్టి యుపకారము చేయుమని మన యాచార్యునితో జెప్పమనియెను. నీ విందులకు సహాయము చేయవలయునని చెప్పెను.