పుట:కాశీమజిలీకథలు -07.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మానందయోగి కథ

31

సఖీ ! మన మీ పురము చేరినది మొదలు ప్రతి దినము తద్విషయమే విమర్శింపు చుంటిని. ఇందుండు సన్యాసులు బైరాగులు పరివ్రాజకులు కపటచిత్తులు గాని మంచివాండ్రుగాఁ దోచలే. శివరాత్రికి నందుగల మఠమునకు వేనవేలు జేరిరి. నే నా మఠములోనికి నిన్నఁబోయితిని. నన్నుఁజూచి పెక్కండ్రు కామాకుల చిత్తులైనట్లు నేను గ్రహించితిని. అట్టివారి నేమని యడుగుదును. ఆ మఠమంతయు దిరుగనొక వృద్దుఁడు నాకుఁ గామవికారము లేనివాఁడుగాఁ దోచెను. ఆ బైరాగి చుట్టును పాపము ప్రజ్వరిల్ల గౌపీనము ధరించి యొడలెల్ల విభూతియు రుద్రాక్షలు నిండియుండఁ రెండవ శంకరుండువలేఁ బ్రకాశించుచుండెను. వేషమునకుఁదగిన చిత్త నైర్మల్య మున్నదియో లేదో తెలిసికొనుట దుర్ఘటము. నేనా యోగి పాదములకు నమస్కరించి స్వామీ! మాది దక్షిణదేశము. మా దేశములో వసిష్టమతమని యొక మతము కలదు. మే మామతము వారము. మే మమ్మహర్షి యాశ్రమము జూడ వేడుక వడి వచ్చితిమి. మార్గమెట్లో చెప్పఁగలరా ? మీకుఁగృతజ్ఞులమై యందుమని పలుకుటయు నతండు కన్నులం దెరచి‌ నన్నుఁజూచి విచారించి చెప్పెద ఱేపురమ్మని యానతిచ్చెను. అతని మాటలు కపట శూన్యములుగాఁ దోచినవి. ఱేపుపోయి తెలిసికొని వచ్చెదనని చెప్పుటయు జితవతి నీకెవ్వరును నచ్చరు. అందఱిని గపటాత్ములందువు వారిలో మహానుభావు లుందురు? వినయ విధేయతలు గనపరచి యడుగవలయుంగాని నీరాజ స్వభావము జూపింపకుము. వేగఁబోయి యాదారి దెలిసికొని రమ్మని నియమించినది.

రోహిణి యమ్మరునాఁడు ప్రాతఃకాలమునఁ ద్రివేణిలో స్నానముజేసి విభూతి బూసికొని యా వృద్దయోగి యొద్దకుఁబోయి నమస్కరింపుచు నతండు గన్నుల మూసికొని యండుటచే సమయ మరయుచు నోరగా నిలువం బడినది. ఇంతలో రమానందుఁడు తెల్లని భస్మంబు మేనెల్లడలం బూసికొని పులితోలు వెనుకవ్రేలాడుచుండ రుద్రాక్ష మాలికాలంక సర్వప్రతీతుండై కౌపీనము ధరించి మూర్తీభవించిన వైరాగ్య ప్రతిపత్తియో యను నొప్పుచు నా వృద్ధసన్యాసి కడకు వచ్చి స్వామీ ! నేను రమానందుఁడ మీ ప్రియశిష్యుఁడఁ బెద్దకాలమునకు మిమ్ముఁ జూడగంటి నిదే మీకు నమస్కారము లర్పించు చుంటినని పలుకుచు సాష్టాంగముగాఁ బండుకొనియెను.

అప్పుడా యోగి కన్నులం దెరచిచూచి లెమ్ములెమ్మని పలుకుచు రమానందుఁ డనఁగా నాకు గురుతు తెలియలేదు. నీ విప్పుడెక్కడనుంటివి? ఎందుండి వచ్చితివి. చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

స్వామీ ! నన్ను మరచితిరా? నేను మీ మిత్రులగు బ్రహ్మానందయోగి శిష్యుఁడను గానా? మా గురువుగారితో వచ్చి వెనుకఁ గొన్ని దినము లిందుండి పోలేదా?